కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వ జీవోతో పాటు విశాఖలో మిలీయనం టవర్ బీ నిర్మాణంపై వేర్వేరుగా దాఖలైన అనుబంధ పిటిషన్లపై..... హైకోర్టులో విచారణ ముగిసింది. కేసులో వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్.... సాధారణ పరిపాలన శాఖలో విజిలెన్స్ కమిషన్ భాగం కాదని న్యాయస్థానానికి వివరించారు. విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల తరహాలో.... విజిలెన్స్ కమిషన్ స్వతంత్ర సంస్థ అని పేర్కొన్నారు. 48 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, స్థలంలేకనే కర్నూలుకు తరలిస్తున్నట్లు వాదించారు.
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.... స్థలం లేకపోతే దగ్గర్లో ఉన్న మరో ప్రాంతానికి తరలించాలి కానీ.... హడావుడిగా వేరే జిల్లాకు తరలించడం ఏంటని.... మరో మూడు నెలలు ఆగలేరా అని ప్రశ్నించింది. అయితే 2019 జులైలోనే నోట్‌ఫైల్స్ వచ్చాయని.... అప్పుడే విజిలెన్స్ కమిషన్ తరలింపునకు బీజం పడినట్లు కోర్టుకు తెలిపారు. కార్యాలయాల తరలింపు అనేది ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని వివరించారు. రాజధాని తరలింపులో ఇది భాగం కాదన్నారు. కార్యాలయాల తరలింపు అనేది ప్రభుత్వ విధానపర నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోవద్దని వాదించారు.
సీఎం నేరుగా ఫైల్ ముందుకు పంపిస్తున్నారా..!
అయితే స్థలం కొరతతో కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్లు నోట్‌ఫైల్స్‌లో ప్రస్తావించలేదని.... పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఆయా శాఖలు, విజిలెన్స్ కమిషన్‌కు మధ్య సమన్వయకర్తలుగా విజిలెన్స్ అధికారులు ఉంటారన్నారు. విజిలెన్స్ కమిషన్‌లో పనిచేసే కొద్దిమంది సిబ్బందికి సచివాలయంలో స్థలం సరిపోతుందని వివరించారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం గుర్తించిన కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదన్నారు. అందుకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.... జీఏడీ నోట్‌ఫైల్స్ ఎక్కడ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీఎం నేరుగా ఫైల్‌ను ముందుకు పంపినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దీనికి బదులిచ్చిన ఏజీ.. ముఖ్యమంత్రి ఫైల్‌ను ముందుకు పంపొచ్చన్నారు. తాము దాఖలు చేసిన వ్యాజ్యంలో కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నామని.... కాబట్టి కేంద్రానికి నోటీసు జారీచేయాలని.... అమరావతి పరిరక్షణ సమితి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ధర్మాసం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానిది ఈ విషయంలో కీలక పాత్ర అని.. ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించింది.
పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగియగా... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి : గవర్నర్‌ను కలిసిన మండలి ఛైర్మన్ షరీఫ్