నవ్యాంధ్రలో మూడు రాజధానుల అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు నగరంలో హైకోర్టు సహా రాజధాని ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం... గతంలో రాజధానిని కోల్పోయిన కర్నూలుకు... రాజధాని, హైకోర్టు ఇవ్వాలని తద్వారా సీమ అభివృద్ధి చెందుతుందని న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టు కోసం న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలను సైతం కలిశారు. ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనపై మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
స్వాగతిస్తున్న న్యాయవాదులు..
అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. జీఎన్ రావు కమిటీ నివేదికలోనూ ఇదే విషయాలు పేర్కొనటంతో... మూడు రాజధానులు వస్తాయని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు అమరావతి రైతులు ఆందోళనలు చేపడుతుండగా... కర్నూలు న్యాయవాదాలు హైకోర్టును స్వాగతిస్తున్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలోనేనా...?
ఒకవేళ హైకోర్టు వస్తే... ఎక్కడ ఏర్పాటు చేస్తారు..? కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలోనే హైకోర్టు ఉంటుందా... లేదంటే... మరెక్కడైనా ఉంటుందా..? అనే చర్చ జరుగుతోంది. తాత్కాలికంగా... ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని... కొందరు న్యాయవాదాలు చెబుతున్నారు. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని... ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని... అక్కడ శాశ్వత భవనాలు నిర్మించి... పూర్తిస్థాయిలో న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు.
హైకోర్టు రావటం వల్ల నిత్యం ఎంతోమంది వివిధ కేసుల విషయమై కర్నూలు నగరానికి వస్తారని... రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు... కర్నూలుకు హైకోర్టు వచ్చినా సాధారణ ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని... పరిపాలన రాజధాని విశాఖకు వెళ్లాలంటే... సుమారు వెయ్యి కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : పకడ్బందీగా దిశ చట్టం అమలుకు సీఎం ఆదేశం