కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల, కొత్తపల్లి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్, పాణ్యం, ఆదోనిమంత్రాలయం మండలాల్లో...కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోసిగి మండలంలో చాపవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గోనెగండ్ల మండలంలో మల్లెలవాగు పొంగుతోంది. బనగానపల్లి మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పచ్చర్ల వాగు కారణంగా బనగానపల్లి నంద్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టంగుటూరు వద్ద పెద్దాపులవాగు, చిన్నాపులవాగు హోరెత్తుతున్నాయి. నంద్యాల నాగలింగేశ్వర ఆలయంలోకి చేరిన వర్షపు నీరు చేరింది. ఓబులాపురంలో దస్తగిరిస్వామి దర్గా వద్ద వర్షపు నీరు నిలిచింది. ఆస్పరి మండలం పుప్పాలదొడ్డి వద్ద వాగు ఉగ్రరూపం దాల్చింది. వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
చెరువులకు గండ్లు..... రాకపోకలకు అంతరాయం
భారీ వర్షాలకు కర్నూలు జిల్లా ముసనాపల్లె చెరువుకు గండి పడింది. దీనివల్ల ఆదోని మండలం నగనాథనహళ్లి గ్రామం వంతనెపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఆదోని-హోలాగుంద మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది. మిడుతూరు మండలం తాళముడిపి వద్ద కుందూ నది ఉద్ధృతంగా ఉంది. కుందూ జోరుతో నంద్యాల-నందికొట్కూరు మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
పాఠశాలలకు సెలవులు
వర్షాలతో కర్నూలు జిల్లా అతలాకుతలం అవుతోంది. నంద్యాలలో భారీ వర్షం కురిసింది. నంద్యాలలో రహదారులన్నీ నీటమునిగాయి. వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నంద్యాల డివిజన్‌లోని అన్నీ మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కోసిగి వద్ద చాపవాగు ఉద్ధృతిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.