Govt Negligence on Rajolibanda Diversion Scheme: సమాజంలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడ్డారని.. ఆ రైతులందరిని చంద్రబాబు అన్ని రకాలుగా, దారుణంగా మోసం చేశారని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన ఎన్నికల సభలో సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కానీ జగన్ పాలనలో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.
కరవు కాటకాలతో విలవిల్లాడే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని రైతుల కష్టాలు తీరాలంటే రాజోలిబండ కుడికాలువ మళ్లింపు పథకం అత్యంత కీలకం. కానీ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి మండలం బాత్ర బొమ్మలాపురం దగ్గర ప్రతిపాదించిన ఆర్డిఎస్ (Rajolibanda Diversion Scheme) నిర్మాణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయింది. తుంగభద్ర నదిలో పుష్కలంగా నీరు ప్రవహించినపుడు.. ఆ నీటిని పొలాలకు మళ్లించేందుకు కుడికాలువ ప్రతిపాదన తెచ్చారు.
ప్రభుత్వ అలసత్వమే.. రాజోలికి 'గుది'బండ.. వెలవెలబోతున్న 40వేల ఎకరాల ఆయకట్టు
నదికి ఎడమవైపు ఉన్నప్రాంతం కర్ణాటక రాష్ట్రం పరిధిలోనిది కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల కిందటే కాలువ నిర్మించుకుని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. నదికి కుడివైపునున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండడంతో కుడి కాలువ నిర్మించాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. రాజోలిబండ కుడికాలువ మళ్లింపు పథకంలో భాగంగా తుంగభద్ర నీటిని మళ్లిస్తే ఏకంగా 40 వేల 270 ఎకరాలకు సమృద్ధిగా నీరందుతుంది.
ప్రాజెక్టులో భాగంగా కోసిగి, పెద్దకడబూరు, కొటెకల్లు, చిన్నమర్రివీడుల్లో జలశయాలతో పాటు 160 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించాలని నిర్ణయించారు. ఫలితంగా నాలుగు టీఎంసీల నీటిని సుమారు 40 వేల 270 ఎకరాలకు ఇవ్వడంతోపాటు 60 గ్రామాల ప్రజలకు తాగునీరు కూడా సరఫరా చేయవచ్చని తేల్చారు. అలాంటి కీలక ప్రాజెక్టు కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2019వ సంవత్సరం జనవరి నెలలో 19 వందల 85 కోట్లకు పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేశారు. అదే సంవత్సరం మార్చి నెలలో ఎస్సిసి సంస్థ టెండర్లలో నిర్మాణ పనులను దక్కించుకుంది.
ఆర్డీఎస్ కాలువ పనులు నిలిపి వేస్తున్నట్లు ఏపీ లేఖ
2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా పనులు జరిగాయి. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి సంబంధించిన కాంక్రీటు పనులు చేశారు. ప్రధాన కాలువ నిర్మాణానికి అవసరమైన భూసర్వే కూడా చేపట్టారు. సుమారు 46 కిలోమీటర్ల మేర సర్వే పనులు కూడా పూర్తయ్యాయి. అనంతరం పనులకు బ్రేకులుపడ్డాయి. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయకపోవడంతో పనులు నిలిపేయాల్సి వచ్చింది. తరువాత పనులు ముందుకు కదల్లేదు.
దీంతో 30 నెలల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నేటికీ అతీగతీ లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా ఏమాత్రం కనబడకపోవడం స్థానిక రైతుల్ని కలవరపరుస్తోంది. 19 వందల 85 కోట్ల విలువైన ప్రాజెక్టు నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు వెచ్చించింది 10 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని రైతులు పెదవి విరుస్తున్నారు.
TS Govt Letter to KRMB: 'రాజోలిబండ హెడ్‌వర్క్స్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోండి'
రాజోలిబండ కుడికాలువ మళ్లింపు పథకానికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరిస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. తొలుత ఈ ప్రాజెక్టుకు 5 వేల 882 ఎకరాల భూమి అవసరం అవుతుందని తేల్చారు. ఆ భూసేకరణ ప్రక్రియ ఎపుడు ప్రారంభం అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది.
తెలంగాణ: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయి