కర్నూలు తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఆదివారంతో ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. సర్పంచి అభ్యర్థికి 723 నామపత్రాలు అందించగా, వార్డు సభ్యులకు 3,079 సమర్పించారు. దీంతో మొత్తం పన్నెండు మండలాల్లోని 193 గ్రామ పంచాయతీలకు సర్పంచి అభ్యర్థికి 1243, వార్డు సభ్యులకు 4,420 నామినేషన్లు అందాయి. ఈ ఘట్టం ముగియడంతో ప్రచారంపై అభ్యర్థులు దృష్టిపెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ), 4న ఉపసంహరణకు అవకాశమిచ్చారు.
ఏకగ్రీవమైనట్లే..!
సర్పంచి, వార్డులకు ఒకే నామినేషన్ పడిన ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లే. పరిశీలన అనంతరం అన్నీ సక్రమంగా ఉంటే ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటిస్తారు. మరో ఆరు పంచాయతీలకు సైతం ఒకే పార్టీ మద్దతుతో నాలుగు, మూడు, రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవి సైతం ఏకగ్రీవాలకే అడుగులు పడనున్నాయి. ఏకగ్రీవాలవబోతున్న అన్ని పంచాయతీలు వైకాపా మద్దతుదారులే కావడం గమనార్హం. నామినేషన్ల స్వీకరణకు సాయంత్రం 5 గంటలకు గడువు కాగా, సకాలంలో వచ్చిన 72 మందికి టోకెన్లు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించారు. దీంతో మహానంది మండలంలోని గాజులపల్లెలో ఆదివారం రాత్రి 8.45 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
ఇక్కడ ఇక ఏకగ్రీవమే!
- దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థికి ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో వైకాపా మద్దతుదారు మాధవీలత ఏకగ్రీవం కానున్నారు. ఇందులో 8 వార్డులుండగా 8 నామినేషన్లు వైకాపా బలపరిచిన వారే.
- గోస్పాడు మండలంలోని దీబగుంట్ల పంచాయతీకి ఒకే కుటుంబం నుంచి సర్పంచి స్థానాలకు రెండు నామినేషన్లు వేశారు. గంగవరం శివమ్మ, గంగవరం వెంకటలక్ష్మమ్మ పేర్లతో నామపత్రాలు సమర్పించారు. 12 వార్డులకు ఒక్కొక్కరే సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా వైకాపా బలపరిచినవారే. దీంతో ఈ పంచాయతీ ఏకగ్రీవం అవ్వనుంది.
- ఉయ్యాలవాడ గోవిందపల్లె పంచాయతీకి వైకాపా మద్దతుదారు ఉమాదేవి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆరు వార్డులకు ఒక్కొక్కటే నామినేషన్ పడటంతో ఈ గ్రామం ఏకగ్రీవం కానుంది. ఇక్కడ అభ్యర్థులందరూ మహిళలే కావడం విశేషం.
- ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి పంచాయతీకి దేశం సోమశేఖర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేశారు. ఆరు వార్డులకు సైతం ఒక్కో నామినేషన్ దాఖలవ్వడంతో వైకాపా మద్దతుదారులు ఏకగ్రీవంగా నిలిచారు.
- మహానంది పరిధిలోని అబ్బీపురం సర్పంచికి నాలుగు నామినేషన్లు రెండు కుటుంబాలు వేశాయి. ఈ ఇద్దరి కుటుంబాలు వైకాపా మద్దతుదారులే. రెడ్డివారి రాధ, మీరాభాయ్ అలియాస్ మీనా పేర్లతో ఒక కుటుంబం నుంచి, శ్రీలక్ష్మీ, జయలక్ష్మీ అత్తాకోడళ్లు మరో కుటుంబం నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీ దీన్ని ఏకగ్రీవం చేసుకోనుంది.
- గత 30 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతున్న మహానంది మండలంలోని సీతారామాపురానికి వైకాపా మద్దతుతో తేజస్విని ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఈ గ్రామంలో పది వార్డులుండగా, వార్డుకు ఒక్కొక్కటి చొప్పున పది నామినేషన్లు సమర్పించారు. ఈసారీ ఈ పంచాయతీ ఏకగ్రీవం వైపే అడుగులు పడినట్లైంది.
- మహానంది పంచాయతీ సైతం ఎస్టీ రిజర్వేషన్ కాగా, వైకాపా మద్దతుదారు శిరీష, ఆమె బంధువు నాగమ్మ రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదీ ఏకగ్రీవంగా అవ్వనుంది.
- పోలూరు పంచాయతీకి గ్రామస్థులు ఐకమత్యంతో ఉన్నత చదువులు చదివి ఐఐటీలో అధ్యాపకునిగా పనిచేస్తున్న కొండపాటి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించారు. ఈ పంచాయతీలో మూడు నామినేషన్లు సర్పంచికి పడ్డాయి. బండిఆత్మకూరు పరిధిలోని రామాపురానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామస్థులతో ఒప్పందం ప్రకారం నూతన దేవాలయానికి రూ.7.50 లక్షలు ఇస్తామన్న హామీతో ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రుద్రవరం మండలం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సొంత గ్రామం ఎర్రగుడిదిన్నెలో ఒకే ఒక్క నామినేషన్ సర్పంచికి దాఖలైంది. వైకాపాలో కొనసాగుతున్న కేశాలు అనే అభ్యర్థి ఈ నామినేషన్ వేశారు. పది వార్డుల్లో పది మంది వైకాపా బలపరిచిన అభ్యర్థులే నామినేషన్లు వేశారు.
ఫిర్యాదుల విభాగం ఏర్పాటు
కర్నూలు నగరం: పంచాయతీ ఎన్నికల్లో అన్ని అంశాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కర్నూలు జడ్పీ పరిపాలన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ‘ప్రత్యేక ఫిర్యాదుల విభాగం (కమాండ్ కంట్రోల్ రూం)ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెం. 1800 4255 180, వాట్సాప్ నెం.88978 70074
ఇదీ చూడండి: పల్లెపోరు: రేపట్నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరణ