Pawan Kalyan Buy Land in Pithapuram : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తారని సమాచారం. ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని ఇక్కడి ప్రజలకు పవన్ మాటిచ్చారు.
పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రజలకు చెప్పారు. ఈ క్రమంలోనే జులైలో మండలంలోని ఇల్లింద్రాడ, భోగాపురం రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల స్థలాలు కొన్నారు. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ రూ.15-16 లక్షల మేర ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం పిఠాపురం వచ్చిన పవన్ గతంలో కొన్నచోటే మరోసారి భూమిని కొనుగోలు చేశారు. మరోవైపు పిఠాపురం బాధ్యత తనదని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేసేందుకు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.
పిఠాపురాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై ఆరా తీస్తున్నారు. పిఠాపురం అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు జరిపి పలు ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు అక్కడి ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అక్కడ ఏ సమస్య ఉన్న నేనున్నానంటూ పవన్ కల్యాణ్ వారికి అండగా నిలుస్తున్నారు.
ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్ - Pawan Kalyan meeting in Gollaprolu