Kurnool Municipality Drainage Canal Repairing Works: కర్నూలు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు.. మురుగునీటి కాల్వలను నిర్మిస్తున్నారు. గతంలో ఉన్న కాల్వలను తవ్వేసి.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీనికి భిన్నంగా.. వర్షాల పేరుతో పనులను ఆపేశారు. దీని వల్ల స్థానికులకు అవస్థలు తప్పటం లేదు.
స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మురుగునీటి కాల్వలను తవ్వేశారు. వీటికి తోడు సుమారు 150 ఇళ్లకు.. రెండు వారాల క్రితం మున్సిపల్ కుళాయి కనెక్షన్లు, ఇళ్లలోకి వెళ్లే మెట్లు తొలగించారు. వర్షాల వల్ల బయటికి వెళ్లి నీరు తెచ్చుకోవటం ఇబ్బందిగా మారింది. బురద వల్ల ఇంట్లోకి రావాలన్నా, బయటకు వెళ్లాలన్నా.. కష్టంగా ఉండటంతో.. చాలామంది ప్రజలు సొంత ఇళ్లను వదిలేసి.. బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అవసరం లేకపోయినా డ్రైనేజీలు 12 అడుగుల మేర తవ్వేసి ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని.. పట్టణ పౌర సంక్షేమ సంఘం నిలదీస్తోంది. దీనిపై అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
"కర్నూలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఇంజినీర్లు చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఎండాకాలమంతా గమ్మున ఉండి.. వర్షాకాల ప్రారంభ సమయంలో కాల్వలు తీయటం ప్రారంభించారు. ఎంత అవసరమో అంత కాల్వలు తీస్తే పర్లేదు.. కానీ వాళ్లకు నాలుగు అడుగులు అవసరమైతే.. 8, 12, 15 అడుగుల వరకు తవ్వి.. వర్షాల పేరుతో రోజులు తరబడి పనులను ఆపేశారు. దీనివల్ల దాదాపు 100 కుటుంబాలకు కుళాయి లైను కట్ చేశారు.. 50 కుటుంబాలు ఇళ్లలో ఉండలేక బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకుంటున్నారు. వందల టీఎంసీ నీరు నిల్వ ఉండేందుకు నిర్మించే డ్యామ్ల నిర్మాణం చేపట్టినట్లు.. ఇనుప రాడ్లు వేసి డ్రైనేజీ కాల్వలు కడుతున్నారు. ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ము, నగర సుందరీకరణకు కేంద్రం ఇచ్చే నిధులను ఏం చేయాలో తెలియక.. ఇలా అనవసరంగా ఖర్చు పెడుతున్నారు." - పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు
"కుళాయి కట్ చేసి 15 రోజులైంది. వర్షాల వల్ల బయటికి వెళ్లి నీరు తెచ్చుకోవటం ఇబ్బందిగా మారింది. బురద వల్ల ఇంట్లోకి రావాలన్నా, బయటకు వెళ్లాలన్నా.. కష్టంగా ఉంది. దీంతో చాలామంది ప్రజలు సొంత ఇళ్లను వదిలేసి.. బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నాము." - బాషా, స్థానికుడు