ప్రశ్న: కర్నూలు జిల్లాలో గ్రామ స్థాయిలో కరోనా విస్తరించడానికి కారణాలేంటి ?
ప్రభాకర్ : మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లో కేసుల్లేవు. తరువాత పాణ్యం, బనగానపల్లె, సంజామలలో బయటి వారి వల్ల కేసులు వచ్చాయి. లాక్డౌన్ తరువాత బయటి ప్రాంతాల నుంచి వలస కూలీలు గ్రామ ప్రాంతాలకు రావడంతో ఒక్క సారిగా కేసులు పెరిగాయి.
ప్రశ్న: కర్నూలు, ఆదోని, నంద్యాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ?
ప్రభాకర్: ప్రస్తుతం కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలు పరీక్షలు చేయించుకోవటానికి ముందుకు వస్తున్నారు. టెస్టులు పెరిగినందు వల్ల కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
ప్రశ్న: ఈ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు?
ప్రభాకర్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గ్రామస్థాయిలో సిబ్బందితో ఎక్కువగా ప్రచారం చేపట్టాం. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభత్ర పాటించాలని చెబుతున్నాం. కొద్ది మంది గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినా అంతరాయం లేకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి.
ప్రశ్న: ఎలాంటి వారికి పరీక్షలు చేస్తున్నారు ?
ప్రభాకర్ : ప్రజల్లో ఆందోళన ఉంది కాబట్టి మాకు పరీక్షలు చేయండి అని ముందుకు వస్తున్నారు. వృద్ధులకు ఎక్కువగా పరీక్షలు చేస్తున్నాం. అన్ని వయస్సుల వారికి వైరస్ వస్తుంది. 50 సంవత్సరాల పైబడిన వారికి ఎక్కువగా వస్తున్నాయి.
ప్రశ్న: పారిశుద్ధ్యం పనులు గ్రామాల్లో ఎలా జరుగుతున్నాయి?
ప్రభాకర్ : ఎక్కడైతే కేసులు రిపోర్ట్ అవుతున్నాయో.. అక్కడ అంతా హైపో ద్రావణం పిచికారి చేస్తున్నాము. కేసులు వచ్చిన ఇంట్లో, వీధిలో, గ్రామంలోనూ హైపో ద్రావణం పిచికారి చేస్తున్నాం. అన్ని విధాలా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతుంది.
ప్రశ్న: కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో లాక్ డౌన్ విధించే పరిస్థితి ఉందా ?
ప్రభాకర్ : ఎక్కువ కేసులు వచ్చిన మండలాలు ఉన్నాయి. అటువంటి చోట జిల్లా కలెక్టర్ అనుమతితో ఆంక్షలు విధించే అలోచన చేస్తున్నాం. తొగర్చేడులో కేసులు ఉంటాయని మేము ఉహించలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబాల వల్ల కేసులు వచ్చాయి. బ్లీచింగ్, హైపో ద్రావణంతో శానిటైజేషన్ చేశాం.
ప్రశ్న: ఈ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఎలాంటి ప్రణాళికలు చేపట్టారు ?
జవాబు : వర్షాలు పడుతున్నాయి. సీజనల్ వ్యాధులు వచ్చినా ప్రజల్లో కరోనా అనే భయం ఉంటుంది. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. నవంబర్ వరకు ప్రతి గ్రామంలో శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడుతాం. నీటి ద్వారా, దోమల నుంచి వచ్చే వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. నిధులు ఉన్నాయి. ప్రజలు కుటంబాన్ని రక్షించుకునేందుకు తమ వంతుగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్క్ ధరించాలి. అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు