కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి తండాలో 22 రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. తండాకు చెందిన శివ నాయక్ (28) మంగళవారం తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చలేక మృతి చెందినట్లు బంధువులు ఆళ్లగడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. గత నెల 15వ తేదీన అతడి భార్య శారద (22) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు అప్పట్లో ఫిర్యాదు చేశారు.
ఓవైపు భార్య ఆత్మహత్య మరోవైపు వ్యవసాయంలో ఇక్కట్లు, నష్టాలు తోడవడంతో శివ నాయక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: పరీక్షించిన ప్రతి 100లో 7.11 మందికి కరోనా