Upper Bhadra project: తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు గుండెకాయ లాంటి తుంగభద్ర జలాశయానికి నీటి చేరిక ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం ఎగువన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో ఏటా 54 టీఎంసీల నీటిని కొల్లగొడుతూ బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకే కర్ణాటక సవాల్ విసిరింది. తాజాగా తుంగ నది నుంచి భద్రలోకి ఏటా 17.4 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి ఆమోదాన్ని తెచ్చుకుంది. జాతీయ హోదా ఇచ్చి మరీ నిర్మాణ బాధ్యతను కూడా కేంద్రమే చేపట్టనుంది.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా.. కర్ణాటకలో 2 లక్షల హెక్టార్లకు సాగు నీరందించడమే లక్ష్యమని డీపీఆర్‌లో పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా కర్ణాటక జలచౌర్యం చేస్తున్నా....సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రాయలసీమవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సకాలంలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీమ రైతులకు....కొత్త ప్రాజెక్ట్ నిర్మాణంతో మరిన్ని తిప్పలు తప్పవు.
కర్ణాటకలోని హోస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు తాగు,సాగు నీరందిస్తోంది.అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు....ఈ నీరే ఆధారం. కేసీ కెనాల్‌కూ ఏటా 10 టీఎంసీలు ఇస్తున్నారు. తుంగభద్ర నది కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదీలో కలిసిపోతుంది. తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమైన శ్రీశైలం జలాశయానికి తుంగభద్ర నీరే ఆధారం. ఎడమకాలువ ద్వారా తెలంగాణకు, పోతిరెడ్డిపాడు నుంచి హంద్రీనీవా, తెలుగుగంగ కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలతోపాటు.. తమిళనాడుకు తాగునీరు అందుతోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో ఈ మూడు రాష్ట్రాలకు తీవ్ర సమస్య ఎదురుకానుంది.
ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో 5 వేల 300 కోట్ల రూపాయలు కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే కేంద్ర జలసంఘం అనుమతులు ఎలా ఇచ్చిందని... కేంద్ర జలశక్తిశాఖ ఎలా ఆమోదం తెలిపిందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడేలా కేంద్ర ఆర్థిక శాఖ.. నిధులు కేటాయించడమూ సరికాదని రైతు, పౌర సంఘాలు, రాజకీయ పక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగానే ఎగువ భద్ర ప్రాజెక్టుకు.. ఆ స్థాయిలో నిధుల్ని కేంద్రం కేటాయించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 55 వేల 548 కోట్ల రూపాయలతో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు రెండో డీపీఆర్‌కు ఇప్పటివరకూ అనుమతి ఇవ్వని కేంద్రం... ఎగువ భద్రకు మాత్రం ఆగమేఘాల మీద నిధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇవీ చదవండి: