Delay Bridge Works On Tungabhadra : కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ప్రవహించే తుంగభద్ర నదికి 2009లో భారీ వరదలు వచ్చాయి. ఈ వరదలకు నందవరం మండలం నాగులదిన్నె వద్ద నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. దీంతో అప్పట్లో రాకపోకలు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాలంటే మంత్రాలయం మీదుగా లేదంటే కర్నూలు మీదుగా వెళ్లాల్సి వచ్చేది.
శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం : నదిలో వరద తగ్గాక తెప్పల్లో రాకపోకలు సాగించాల్సి వచ్చేది. ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో 2012లో 39 కోట్ల రూపాయల వ్యయంతో నాగులదిన్నె వంతెనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడాది లేదా రెండేళ్లలో పూర్తి అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
రాష్ట్రం విడిపోయిన కొనసాగిన బంధుత్వాలు : తరతరాలుగా కర్నూలు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య బంధుత్వాలు కొనసాగుతున్నాయి. శుభకార్యాలు జరిగినా, ఎవరైనా చనిపోయినా ఇటు వారు అటు, అటు వారు ఇటు వచ్చిపోతుంటారు. పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం.. ప్రజలకు అవస్థలు : మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన పంటను ఎమ్మిగనూరు, ఆదోనికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వైద్య సేవల కోసం కర్నూలు జిల్లాకు వస్తుంటారు. దీంతో ఈ మార్గంలో నిత్యం వందల మంది ప్రజలు రెండు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చాలా ఆలస్యం కావటంతో ప్రజలకు అవస్థలు తప్పటం లేదు.
బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు : ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తైంది. కానీ ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రమాదకరంగానే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి పూట చీకటిలో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే అవస్థలు తప్పటం లేదు. చాలా సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. త్వరగా బ్రిడ్జిని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
"రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది. 11 సంవత్సరాలు అయింది.. ఇంతవరకూ బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. ఆలాగే రోడ్డు పనులు పూర్తి పనులు పూర్తి కాలేదు. అడిగినపుడు మాత్రమే వాళ్లు పని ప్రారంభిస్తున్నారు. తరువాత చేయడంలేరు. ఈ బ్రిడ్జి పనులు పూర్తి అయి ఓపెన్ అయి, రోడ్డు మంచిగా ఉంటే మాకు చాలా మంచిగా ఉంటది. " - స్థానికుడు
"ఇబ్బందులు పడుతున్నాం. మా బాధలు ఎవ్వరూ అర్ధం చేసుకోరు ఇంకా. ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డే వేసేవారు లేరు. మా ఊరి ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. అసలు ఏమీ పని జరుగుతలేదు. " - స్థానికుడు
ఇవీ చదవండి