కర్నూలు జిల్లాలోని అతి పెద్ద పట్టణాల్లో ఆదోని ఒకటి. రెండో ముంబయిగా పేరుగాంచిన ఈ పట్టణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పత్తి మార్కెట్, జిన్నింగ్ మిల్లులు, ఇండస్ట్రియల్ ఏరియా, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. నిత్యం ఎంతోమంది రైతులు, వ్యాపారులు, ప్రజలతో కిటకిటలాడుతుంటుంది. బళ్లారి నుంచి హైదరాబాద్కు, కర్నూలుకు వెళ్లాలంటే ఆదోని మీదగానే వెళ్లాల్సి ఉంటుంది. బైపాస్ లేకపోవటంతో... పట్టణంలో నుంచే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఆదోనికి వెళ్లే రహదారులు పూర్తిగా పాడైపోయాయి. గత నెలలో కురిసిన వర్షాలకు మరింత ఘోరంగా మారాయి.
ఆదోని- బళ్లారి రహదారి, ఆదోని- పర్వతంపురం రోడ్డు, పట్టణంలోని శ్రీనివాస భవన్ కూడలి నుంచి గణేష్ సర్కిల్ వరకు, మున్సిపల్ మెయిన్ రోడ్డు నుంచి షరాఫ్ బజార్ వరకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. కంకర తేలిపోయింది. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు దుమ్ము, ధూళితో తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భారీ వాహనాలు వేగంగా వెళుతున్నప్పుడు కంకర ఎగిరిపడుతోంది. గోతులు, గతుకుల రోడ్డుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు బాగాలేవని మాట్లాడినందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఆటో డ్రైవర్ను విచక్షణారహితంగా కొట్టడం మరింత ఆందోళన కలిగిస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రహదారులు బాగుచేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..