వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా 2011 సెప్టెంబరు 5, 6వ తేదీల్లో కర్నూలు జిల్లా ఆదోనిలో ఇరువర్గాల మధ్య చెలరేగిన మత ఘర్షణలకు సంబంధించిన మొత్తం 33 కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్నవారందరిపైనా విచారణను ఉపసంహరించుకుంటూ సంబంధిత న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది.
మత ఘర్షణల సందర్భంగా ఆస్తుల విధ్వంసం, అల్లర్లకు పాల్పడటం, మారణాయుధాలతో ప్రదర్శన చేయటం, రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించటం, ఇళ్లు కొల్లగొట్టటం, అక్రమంగా చొరబడటం, ఇళ్లను తగలబెట్టాలనే ఉద్దేశంతో అగ్గి, పేలుడు పదార్థాలు వినియోగించటం, ప్రమాదకర ఆయుధాలతో దాడి చేయటం, హత్యాయత్నం తదితర అభియోగాలపై వందల మందిపై ఆదోని ఒకటో పట్టణ, రెండో పట్టణ, మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రస్తుతం వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. వీటిల్లో 33 కేసుల్ని ఎత్తేయాలంటూ డీజీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఆదోని ఒకటో పట్టణ పరిధిలో నమోదైన 12, రెండో పట్టణ పరిధిలో నమోదైన 18, మూడో పట్టణ పరిధిలో నమోదైన 3 కేసుల్ని ఉపసంహరించుకుంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి