కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనలో న్యాయం కోసం పోరాడుతున్న వారికీ బెదిరింపులు ఎదురవుతున్నాయని.. అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 'అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి' ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో... కార్యాచరణపై వివిధ పార్టీల నాయకులు చర్చించారు. సీబీఐ లేదా జ్యుడిషియరీ విచారణ చేపట్టాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులకే వత్తాసు పలికేలా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడటమేంటని మండిపడ్డారు.
నిరాహార దీక్షలు, కవాతులు, కొవ్వొత్తుల ర్యాలీలతో కర్నూలు జిల్లా నంద్యాలలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమీపంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించగా.. తెదేపా నేత ఎన్ఎండీ ఫరూక్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సలాం కుటుంబసభ్యులను ఎంఐఎం నాయకులు పరామర్శించారు. విషాద ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి సరిగా స్పందించలేదన్నారు. శ్రీనివాస నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు ఎంఐఎం నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ పోరు