వ్యవసాయం ప్రధానాంశంగా తెరకెక్కిన 'మహర్షి' సినిమాలో మహేష్‌బాబుకు సాగు పాఠాలు నేర్పే ముసలి రైతు పాత్ర అందరికీ బలంగా కనెక్ట్ అయింది. సినిమాలో అది కీలకపాత్ర కూడా. అంతటి ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన వ్యక్తికి... అది తొలి సినిమా అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. దశాబ్దాల నాటక ప్రస్థానం, ప్రశాంతంగా పదవీ విరమణ అనంతర జీవనం సాగిస్తుండగా సినీ అవకాశం తలుపు తడితే రెండుచేతులా అందుకున్నారు గురుస్వామి.
కర్నూలుకు చెందిన గురుస్వామి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. నాటక అనుభవమున్న ఆయనతో కొందరు యువకులు లఘుచిత్రాల్లో నటింపజేశారు. 77ఏళ్ల వయసులో 'ఆయుష్మాన్‌భవ' షార్ట్ ఫిలింలో కనిపించారు. అది దర్శకుడు వంశీ పైడిపల్లి చూడటం, ఆడిషన్‌కు పిలిచి సెలెక్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. 'మహర్షి'తో మంచిపేరు రావడంతో వకీల్‌సాబ్, భీష్మ, అశ్వత్థామ వంటి పది చిత్రాల్లో గురుస్వామి నటించారు. రజనీకాంత్ 'అన్నాత్తే' చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉందంటున్నారు.
మలి వయసులో సినిమా అవకాశాలు రావడం పట్ల గురుస్వామి కుటుంబసభ్యులు, ఆయనతో లఘుచిత్రాలు తెరకెక్కించినవారు సంతోషపడుతున్నారు. చివరిశ్వాస వరకూ సినిమాల్లోనే ఉంటానని, నటుడిగానే మరణిస్తానని గురుస్వామి అంటున్నారు.
ఇదీ చదవండి: MAA elections: 'మా' ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ