2008- డీఎస్సీ అభ్యర్థుల కన్నీటి గాధకు అంతే లేకుండా పోయింది. అప్పట్లో నోటిఫికేషన్ ప్రకారం... 4,657 మంది డీఎస్సీ అభ్యర్థులు మెరిట్ లిస్టులో ర్యాంకు సాధించారు. ఉద్యోగం రావటమే తరువాయి. అదే సమయంలో డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించటంతో... చివరి నిమిషంలో వీరందరికీ ఉద్యోగాలు రాలేదు. మెరిట్ లిస్టులో పేరున్నవారి ఆశలు అడియాసలయ్యాయి. నాటి నుంచి నేటి వరకు అభ్యర్థులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నేటికీ వారికి ఉద్యోగాలు రాలేదు.
ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం... మినిమం టైం స్కేల్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వటానికి అంగీకారం తెలిపింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటంతో... ఉద్యోగాలు రాలేదు. అప్పట్లో పాదయాత్ర చేస్తున్న జగన్ను కలిసి... తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారంలోకి వస్తే... ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా లాక్ డౌన్ సమయంలో మే నెలలో... అంగీకార పత్రాలు ఇవ్వాలని... ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలా 193 మంది అంగీకారం తెలుపుతూ లేఖలు ఇచ్చారు. అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగం అన్నట్లుగా... ఊరిస్తూనే ఉన్నా... నేటికీ కొలువులు మాత్రం రాలేదని అభ్యర్థులు వాపోతున్నారు. డీఎస్సీ అభ్యర్థులంతా జీవనోపాధి కోసం ప్రయివేటు ఉపాధ్యాయులుగా... ఉద్యోగులుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ప్రభుత్వం కొలువులు ఇస్తున్నట్లు ప్రకటించటంతో... ఉన్న ఉద్యోగాలు వదిలేశారు. ప్రభుత్వ కొలువు ఎప్పుడు వస్తుందో నేటికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయం... సర్కారు పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ- 2008 ఉత్తీర్ణులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: