Chandrababu Road show in Gudiwada : ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన చేపట్టారు. బుధవారం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన చంద్రబాబు.. స్థానికంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంలో, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు. రాత్రి బస అనంతరం ఇవాళ అక్కడి నుంచి రోడ్ షో ద్వారా గుడివాడకు బయల్దేరారు. మార్గమధ్యంలో నందమూరి బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామస్తులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు చంద్రబాబు పూలమాలలు వేసి అర్పించారు.
గుడివాడలో ఉద్రిక్తత... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా.. నిమ్మకూరు నుంచి గుడివాడ వరకు చంద్రబాబు రోడ్ షో చేపట్టారు. రోడ్ షో గుడివాడకు చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మరో వైపు వైఎస్సార్సీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల పరస్పరం దాడులకు దిగాయి.
వైఎస్సార్సీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. గుడివాడ శరత్ టాకీస్ వద్ద కొడాలినాని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ జెండాలతో పలువురు కార్యకర్తలు హల్ చల్ చేస్తూ.. తెలుగుదేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలు చేయడంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు అటుగా వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అనుచరులను అడ్డుకునే యత్నం చేయడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులు, ప్రత్యేక బలగాలు గుడివాడకు చేరుకున్నాయి. పోలీసులను బృందాలుగా విభజించి.. అధికారులు రూట్లు నిర్దేశించారు. కొడాలి నాని కార్యాలయం వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు ఘర్షణతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కవ్వింపు చర్యలకు దిగవద్దని పోలీసులు వైఎస్సార్సీపీ వర్గీయులను కోరారు. గుడివాడలో ఉద్రిక్తత దృష్ట్యా చంద్రబాబుకు భద్రతగా ఎన్ఎస్జీ ఆదనపు బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు రూట్ మ్యాప్‌ను పర్యవేక్షిస్తున్నాయి.
గుడివాడకు అదనపు పోలీసు బలగాలు.. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యాన.. అదనపు పోలీసులు, ప్రత్యేక బలగాలు గుడివాడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ బృందాలు ఎదురెదురుగా తారసపడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవ్వరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి :