దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెల్లూరులో వైకాపా నేతలు నివాళులర్పించారు. గాంధీ బొమ్మ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ చూపిన బాటలోనే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్ పయనిస్తున్నారని చెప్పారు.
వైఎస్ ఆశయాలకు అనుగుణంగా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడపలోని వైఎస్ విగ్రహానికి అంజాద్ బాషా పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, దుట్టా రామచంద్రారావు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మూడు ప్రాంతాల అభివృద్ధి దిశగా
విజయవాడలోని వైఎస్సార్ భారీ విగ్రహానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
వైఎస్ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కించిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. కార్పొరేట్ విద్య, వైద్యం పేదలకు అందేందుకు వైఎస్ కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్ అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నారన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి దిశగా జగన్ పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. సప్తగిరి కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి