కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కొత్తగూడెం గ్రామంలో.. విజయశాంతి హత్యకు భర్త సుధాకర్, అత్తమామలు సుజాత, సూర్యనారాయణ రావులే కారణమని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశానుసారం తిరువూరు సీఐ శేఖర్‌బాబు, చాట్రాయి ఎస్ఐ శివ నారాయణ, పోలీసు బృందం దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మృతురాలి భర్త, అత్తమామలు చెప్పినట్లుగానే.. విజయశాంతి బాత్రూంలో పడటంతో మృత్యువాత పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు నమ్మారని డీఎస్పీ తెలిపారు.
తరువాత అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు రాధ, రామ్మోహనరావు, సోదరుడు సాయి కృష్ణ ఫిర్యాదు మేరకు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసు బృందం విస్తృతంగా నిర్వహించిన దర్యాప్తులో భర్త, అత్తమామలే పాలలో నిద్రమాత్రలు కలిపి.. విజయశాంతిని గొంతునులిమి హత్య చేసినట్లు నిర్ధరణ జరిగిందని ఆయన వివరించారు. వైద్యాధికారులు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో ఇదే విషయం ధ్రువీకరించినట్లు తెలిపారు. విజయశాంతిని తామే హత్య చేసినట్లు.. మండల తహసీల్దార్ ఎదుట ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు హంతకులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు వివరించారు.
ఇదీ చదవండి: