తుమ్మలపల్లి కళాక్షేత్రం
మహిళలను సౌందర్య సాధనంగా చూసినంత కాలం సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంటుందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. మహిళా దినోత్సవం పేరుతో ఏటా సంబరాలు చేసుకుంటున్నా....నిజమైన మహిళా సాధికారత సాధించామా? లేదా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలని జేసీ మాధవీలత అన్నారు. కార్యక్రమంలో భాగంగా పోషణ్ అభియాన్ పథకానికి సంబంధించిన గోడపత్రాలను కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత విడుదల చేశారు. ఆత్మరక్షణకు సంబంధించి పలువురు యువతులు విన్యాసాలు చేసి చూపించారు. అనంతరం జేసీ మాధవీలతతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను సత్కరించి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.
వేదిక కల్యాణ మండపం
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళలను వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కరించారు. విజయవాడలోని వేదిక కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకలో సేవా రంగం, మోడలింగ్, క్రీడలు, పరిపాలనా రంగాల్లో సేవలకు అవార్డులు అందించారు. విశ్రాంత కలెక్టర్ సతీమణి శోభలత, నీలం బాల, సంజనా జాన్, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ, అరుణ, కలెక్టర్ దేవసేనను ట్రస్ట్ చైర్ పర్సన్ వసంత లక్ష్మి, విశ్రాంత కలెక్టర్ లక్ష్మీకాంతం ఘనంగా సత్కరించారు. వారి వారి రంగాల్లో మహిళలు చేస్తున్న కృషిని వసంత లక్ష్మి కొనియాడారు. స్త్రీ సాధికారతను గుర్తు చేసేందుకే మహిళలను సత్కరించినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పురస్కార గ్రహీతలతో పాటు పలువురు మహిళలు ర్యాంప్ వాక్ చేసి ఆహుతులను అలరించారు. మహిళా దినోత్సవం రోజున ఇలా సత్కారం అందుకోవడంపై పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.