పాలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం ఆధారంగా సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మూడు జోన్లలో ఆయకట్టుకు అధికారులు నీటిని పంపిణీ చేస్తున్నారు. వర్షపాతం అధికంగా ఉండటం వంటి పలు కారణాలరీత్యా ఈ ఏడాది రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది పుష్కలంగా నీరు విడుదల అవుతుందని అన్ని ప్రాంతాల రైతులు ఎదురుచూశారు. ఒకటి, రెండు జోన్లలో తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రంలోని తిరువూరు, గంపలగూడెం మండలాలు ఉండగా, మూడవ జోన్ పూర్తిగా మన రాష్ట్రంలోని సుమారు లక్షన్నర ఎకరాల ఆయకట్టుతో ఉంది. ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీ నుంచి మూడవ జోన్ అవసరాలకు నీరు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, జాప్యం నెలకొంది.
సమాచారం అందించినా ఫలితం లేదు..
కనీసం మూడు వేల క్యూసెక్కులను రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తే, మన రాష్ట్ర సరిహద్దుల్లో రెండువేల పైచిలుకు క్యూసెక్కుల నీరు చేరుతుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర అధికారులు తెలంగాణ అధికారులకు సమాచారం అందజేసినా, అందుకు తగిన ప్రతిస్పందన లేదు. రాష్ట్ర అవసరాలకు మూడు వేల క్యూసెక్కులు అవసరంగా పేర్కొన్న అధికారులకు తాజాగా 500 క్యూసెక్కుల నీరు సరిహద్దులోని నూతిపాడు నియంత్రిక వద్దకు చేరటం నిరాశకు గురి చేసింది. మైలవరం బ్రాంచి కాలువ ద్వారా మైలవరం, నందిగామ ప్రాంతాలకు ఈ నీటిని విడుదల చేయాల్సి ఉన్నా, చివరి భూములకు చేరే అవకాశం లేకపోవటంతో ప్రస్తుతం నూజివీడు బ్రాంచి కాలువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు కూడా నూజివీడు బ్రాంచి పరిధిలోని చివరి వరకు చేరటం ప్రశ్నార్ధకంగా మారింది.
అదను దాటుతున్నా...
రబీ సీజన్‌లో ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలోని భూముల్లో ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు సమాయత్తమయ్యారు. అదనుకు పంటలు వేసి, సాగునీటి కోసం ఎదురు చూశారు. ప్రణాళిక ప్రకారం మొదటి జోన్‌కు, రెండో జోన్‌కు అధికారులు నీటిని విడుదల చేయటంతో సాగు పనులు ముమ్మరం చేశారు. నీరందించే సమయం ఆసన్నమై, పంటకు నీరు అవసరమయ్యే సమయం ముంచుకొచ్చినా కాలువలకు చేరలేదు. తొలి నుంచి తెలంగాణలోని మొదటి, రెండు జోన్లకే నీటి సరఫరా పరిమితం కావటంతో మన రాష్ట్రంలోని పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు రానున్న వేసవిలో తాగునీటి చెరువులు నింపేందుకు పలు ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. సమయానికి నీరు విడుదల కాకుంటే, వేసవిలో నీటిఎద్దడి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని, అవసరాలకు తగిన విధంగా నీటిని అందించాలని కోరుతున్నారు.
త్వరలో విడుదలయ్యే అవకాశం..
రాష్ట్ర అవసరాలకు కనీసం మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని, షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 15 నాటికి రాష్ట్రానికి చేరేలా చూడాలని నవంబరులోనే తెలంగాణ అధికారులకు సమాచారం అందించినట్లు విస్సన్నపేట డీఈఈ యు. సింహాద్రి తెలిపారు. సమయానికి నీరు విడుదల చేయలేదని ఆయన అన్నారు. సంబంధిత నియంత్రిక నుంచి పెద్దమొత్తం నీరు మధిర బ్రాంచి కాలువకు విడుదల చేస్తూ, మన రాష్ట్రానికి కేవలం 500 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ అధికారుల వద్ద ప్రస్తావించగా, ఈనెల 13 నుంచి 21వ తేదీలోగా మధిర బ్రాంచికి పూర్తిగా నిలిపివేసి, మూడో జోన్‌కే మొత్తం నీటిని కేటాయిస్తామంటూ సమాధానం ఇచ్చారని సింహాద్రి తెలిపారు.
ఇదీ చదవండి: కాగుతున్న నూనెలు.. సామాన్యులపై మోయలేని భారం