రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల నియామక ప్రక్రియ జరగుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లకు వార్డు వాలంటీర్లను వీఎంసీ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనే మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి. విజయవాడ నగర పరిధిలో 5వేల 648 వార్డు వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే..5వేల 250మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వార్డు వాలంటీర్ల నియామకానికి ఇంటర్ కనీస విద్యార్హత కాగా.. వీఎంసీ పరిధిలో వచ్చిన దరఖాస్తుల్లో 35శాతం మాత్రమే ఇంటర్ విద్యార్హత కలిగినవారు ఉన్నారు. మిగిలిన దరఖాస్తుల్లో ఎక్కువమంది బీటెక్ పట్టభద్రులు కాగా..20శాతం మంది పీజీలు చేసినవారున్నారు.
ఖాళీల కంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఇంటర్వ్యూకు హాజరైన ప్రతి ఒక్కరికీ వార్డు వాలంటీర్‌గా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 65శాతం మంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. వారిలో కూడా ఇంటర్ విద్యార్హత ఉన్నవారి కంటే.. ఎంటెక్, ఎంఎస్సీ, బీటెక్ తో పాటు ఇతర డిగ్రీలు చేసిన వారు ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు.
ఈ నెల 25వరకూ వార్డు వాలంటీర్ల ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ కారణాల వల్ల ఇంటర్వ్యూలకు హాజరుకాలేని వారికి ఇవాళ మరో అవకాశం కల్పిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రేపు (శనివారం) విడుదల చేయనున్నారు.