గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 7 రోజులపాటు 14 రకాల పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ కేటగిరీ 1, 3 లోని పలు ఉద్యోగాల నియామకానికి ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 10 గంటలనుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,221 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను 9.15 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. కొవిడ్ దృష్ట్యా పరీక్షల నిర్వహణలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించిన వారినే కేంద్రంలోకి అనుమతించారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి శరీర ఉష్ణోగ్రతను, ఆక్సీమీటర్‌తో శ్వాసను పరీశీలించి లోపలకు పంపారు. 16 మందికి ఒక గదిని ఏర్పాటు చేశారు.
కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ప్రత్యేక ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేశారు. ఈ గదుల్లో ఇన్విజిలేటర్లు పీపీఈ కిట్లు ధరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు కేటగిరీ 3 లోని డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్దకు ఆర్టీసీ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసింది.
వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది నియామకం కోసం చేపట్టిన పరీక్షలు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరీక్ష కోసం అభ్యర్థులు గంటన్నర ముందుగా కేంద్రాలకు చేరుకున్నారు. జగ్గయ్యపేట పట్టణంలో 8 కేంద్రాలు, మండలంలోని 4 కేంద్రాల్లో 3000 మంది పరీక్షలకు హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి...