బలమైన ఆర్థిక మూలాలున్న ఇద్దరు వ్యక్తులు విజయవాడ స్థానం నుంచి ఈసారి బరిలోకి దిగి పోరును ఆసక్తికరంగా మార్చారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై 74 వేలపై చిలుకు ఓట్ల తేడాతో గెలిచిన నాని... ఈసారి మళ్లీ విజయాన్ని అందుకునేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఎమ్మెల్యేలు బలంగా ఉండటం ఆయకు కలిసోచ్చే అంశం. గ్రామీణ ప్రాంతంలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరులపై దృష్టిసారించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు ముఖ్యమంత్రి సహాయనిధి ఆయనకు బాగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది.
అనూహ్యంగా వైకాపా అభ్యర్థి పొట్లూరి..
వైకాపా తరపున బరిలో ఉన్న పొట్లూరి వీరప్రసాద్ ఆర్థికంగా బలమైన వ్యక్తే. నిజానికి 2014 ఎన్నికల్లో తెదేపా తరపున టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ 2013లోనే చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో కేశినేని నాని పార్టీలో చేరారు. నాడే ఆయనకు టిక్కెట్‌పై హామీ ఇచ్చి ఉన్నందున పీవీపీకి అవకాశం దక్కలేదు. అప్పటికే వైకాపా తరపున కోనేరు రాజేంద్రప్రసాద్ బరిలోకి దిగారు. ఈసారి ఆయనికి టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో తొలుత దాసరి జైరమేష్ పేరు పరిశీలనకు వచ్చింది. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో పీవీపీ పేరు తెరపైకి వచ్చింది. 7 నియోజకవర్గాల్లో కేవలం తిరువూరు మాత్రమే వైకాపా చేతిలో ఉంది. జలీల్ ఖాన్, వంగవీటి రాధా వంటి వారు తెదేపాలోకి చేరిక వైకాపాను ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత..జగన్ పై ఉన్న ప్రజాధరణతో గెలుస్తామనే ధీమా వైకాపాలో ఉంది. ఈసారి విజయవాడ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవటం ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు.
ప్రధాన పార్టీల మధ్య పోటీ..
ఇక మిగతా పార్టీల నుంచి పోటీ నామామాత్రమే. ప్రధాన పోటీ తెదేపా-వైకాపాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ఉంది. జనసేన నుంచి ముత్తంశెట్టి సుధాకార్ బరిలో ఉన్నారు. ఆయన ఏ మేరకు ప్రభావం చూపుతారనేది చూడాలి. కాంగ్రెస్, భాజపాలపోటీ నామామాత్రమేం.
ఐదేళ్ల చేసిన అభివృద్ధినిపైనే ఆశలు పెట్టుకున్న తెదేపా ఒకవైపు ఉంటే...మరోవైపు నవరత్నాలతో ముందుకెళ్తోంది వైకాపా. ఇరు పార్టీల నుంచి ఇద్దరు బలమైన వ్యక్తులు బరిలోకి దిగటంతో బెజవాడ రాజకీయంలో ఎవరూ నెగ్గుతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.