Vijayawada to Sharjah Flight services started TODAY: విజయవాడ నుంచి నేరుగా షార్జాకు ఈరోజు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి రెండు రోజులు ప్రతి సోమవారం, శనివారం నడవనున్నాయి. షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా వచ్చిన విమానానికి ఫైర్ సిబ్బంది రాయల్ వాటర్ సెల్యూట్ పలికారు. అనంతరం ప్రయాణికులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాసులు స్వాగతం పలికారు. విజయవాడ నుంచి షార్జాకు వెళుతున్న ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను అందజేశారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జాకు విమాన సేవలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని వైకాపా ఎంపీ బాలశౌరి అన్నారు. రానున్న రోజులలో సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాంగ్‌కు విమానాలు గన్నవరం నుంచి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ విమానంలో 3 టన్నుల సరుకు రవాణా చేసే సదుపాయం ఉందని.. రైతులు పండించిన పంటను దుబాయ్‌కి తీసుకువెళ్లేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. వీటితో పాటు కార్గో సేవలూ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గతంలో గన్నవరం విమానాశ్రయం ఆర్టీసీ బస్టాండ్ కన్నా దారుణంగా ఉండేదని.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో విమానాశ్రయాన్ని సుందరవనంగా తీర్చిదిద్దామని తెదేపా ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. అనంతరం ఎయిర్ ఇండియా కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో మరిన్ని విమానాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: