విజయవాడ నగరం నూతన పోలీస్ కమిషనర్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న బత్తిన శ్రీనివాసులుకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుతం అదనపు సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు నగరంపై ఇప్పటికే తగినంత అవగాహన ఉంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న రౌడీయిజం, భూ సెటిల్‌మెంట్లు, ట్రాఫిక్ అవస్థలు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, కిందిస్థాయిలో అవినీతి లాంటి సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైల్వే, రోడ్డు మార్గాలకు విజయవాడ అనుసంధానంగా ఉన్నందున గంజాయి స్మగ్లింగ్ నగరం మీదుగానే సాగుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లు, ప్రైవేటు బస్సుల్లో పంపిస్తున్నారు. టాస్క్ ఫోర్స్‌ను మరింత క్రియాశీలం చేయడం సహా, కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్‌ను మరింత పటిష్టపరచాలనే భావన వ్యక్తమవుతోంది.
నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ పోలీసుల నిఘా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. క్షేత్రస్థాయిలోని వాస్తవ సమాచారం పైకి చేరడం లేదు. నగరం పరిధిలో దాదాపు 450 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో క్రియాశీలకంగా ఉన్నవారిపై నిఘా ఉంచిన అధికారులు.. రౌడీషీట్ లేకుండా గ్యాంగ్‌లు నడుపుతున్న వారిని విస్మరిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ కార్యకలాపాలను నిరోధించాల్సిన అవసరం ఉంది. కొత్త పేట, కృష్ణలంక, పాయకాపురం, పటమట, పెనమలూరు స్టేషన్ల పరిధిలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయి.
ట్రాఫిక్ సమస్యలు తీవ్రం
ట్రాఫిక్ సమస్యలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. రోడ్డు పైకి వస్తే ఎప్పుడు బయటపడతామో తెలీని పరిస్థితులు ఎదురవుతున్నాయి. విజయవాడ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ ట్రాప్డ్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌కు 11 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేయగా... ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. పలు చోట్ల సిగ్నల్ లైట్లు పాడయ్యాయి. షాపింగ్ కాంప్లెక్సుల్లో సెల్లార్ పార్కింగ్ లేనందున వాహనాల పార్కింగ్‌తో రోడ్లు నిండిపోతున్నాయి. నగరపాలక సంస్థ, రవాణా, జాతీయ రహదారుల విభాగం అధికారుల సమన్వయంతో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. కాల్ మనీ వ్యవహారాలతోనూ ఆందోళన నెలకొంది. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు నమోదు కాకపోయినా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఆయా కేసులను సరిగా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ' స్పందన'లో మళ్లీ కాల్‌మనీ ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి..
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.. 17 నుంచి కర్ణాటకకు బస్సులు