ఇంటి పనుల తర్వాత మిగతా సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని భావించిన కృష్ణా జిల్లా వక్కలగడ్డకు చెందిన ఐదుగురు మహిళలు.. ఏదైనా వ్యాపారం చేయాలని సంకల్పించారు. భర్తకు, పిల్లలకు చేదోడు వాదోడుగా నిలవాలనుకున్నారు. ఒకరోజు వాకింగ్ చేస్తుండగా వీరికి పిండివంటల వ్యాపారం ఆలోచన వచ్చింది. 2003లో మధుర, రుచి, శ్రీసాయి హోం ఫుడ్స్ సంస్థలను ఆరంభించి ఆలోచనను అమల్లోకి తెచ్చారు. కజ్జి కాయలు, నేతి బొబ్బట్లు, సున్నుండలు, అరిసెలు, చలివిడి, పచ్చళ్లు, ఇతర ప్రత్యేక వంటలు చేస్తూ.. పెద్దఎత్తున ఆర్డర్లు పొందుతున్నారు.
ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ..
ఒక్కొక్కరు 500 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి.. ఆంధ్రులు మెచ్చే వంటలు తయారుచేసి దేశ నలుమూలలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, సింగపూర్, కెనడా , అరబ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకుంటూ.. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని నిజం చేస్తున్నారు. ఐదుగురు సభ్యులు మంచి ఆదాయం పొందడంతో పాటు.. మరో 50 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు.
విజయం సాధించడానికి ప్రాంతంతో సంబంధం లేదు..
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని.. విజయం సాధించడానికి ప్రాంతంతో సంబంధం లేదని వక్కలగడ్డ వనితలు నిరూపించారు. తమ వంటకాలతో దేశ విదేశాల్లో వారికీ రుచులు పంచుతూ నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: