చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు పుట్టినప్పుటి నుంచి ఐదేళ్ల వరకు దశల వారీగా టీకాలు వేస్తారు . అయితే ఈ ఏడాది మార్చి నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందటంతో వ్యాక్సినేషన్‌కు మొదట్లో కొంత అంతరాయం ఏర్పడింది. మార్చి నెలాఖరు, ఏప్రిల్ నెలల్లో పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు కొంతమంది తల్లిదండ్రులు ముందుకు రాలేదని కృష్ణా జిల్లా అధికారులు చెప్పారు. ఆ తర్వాత వాక్సిన్ల కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశామని తెలిపారు.
ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా టీకాలు
గర్భిణులు, పసిపిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు కొన్ని ఉంటాయి . రెగ్యులర్‌గా పీహెచ్సీ, ఆరోగ్య ఉపకేంద్రాలకు వచ్చే వారి వివరాలు సేకరించి ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా వారికి వ్యాక్సినేషన్లు ఇప్పించామన్నారు. ప్రస్తుతం ఆంక్షలు సడలించటంతో పీహెచ్సీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లో బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. మరోవైపు అవుట్ రీచ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ సుహాసిని తెలిపారు. ఉపకేంద్రాల వద్దకు వచ్చిన వారికి కరోనా నిబంధనలు పాటిస్తూ, ఇమ్యునైజేషన్ కార్యక్రమం జరుపుతున్నామన్నారు.
క్యాంపుల ద్వారా ఇమ్యునైజేషన్
ఒక్కొక్క ఏఎన్ఎంకు 5 గ్రామాలుంటాయని.. శనివారం తమ పరిధిలోని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఇమ్యునైజేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పుట్టిన బిడ్డలకు ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్న వాటిని నిలువరించేందుకు హెపటైటిస్ బీ, బీసీజీ టీకాలు, పోలియో చుక్కలను వేస్తున్నట్లు చెప్పారు. ఒకటిన్నర, రెండున్నర, మూడున్నర నెలల పిల్లలకు పెంటావెలెంట్ టీకా, 9 నెలల పిల్లలకు మీజిల్స్, జేఈ మొదటి మోతాదు, విటమిన్ ఏ ద్రవం ఇస్తున్నామన్నారు. ఒకటిన్నర ఏడాది పిల్లలకు డీపీటీ, పోలియో బూస్టర్స్, మీజిల్స్, జేఈ రెండో మోతాదు, విటమిన్ ఏ ద్రవం ఇస్తున్నారు. 5 ఏళ్ల పిల్లలకు డీపీటీ బూస్టర్ రెండో మోతాదు ఇస్తున్నామన్నారు.
ఈ సంవత్సరం జిల్లాలో 3 వేల మందికి పైగా పసిపిల్లలకు సకాలంలో టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ..ఇమ్యునైజేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరోవైపు వ్యాక్సినేషన్ ముందు పిల్లల తల్లిదండ్రులకు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలతో అవగాహన కల్పించామన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇమ్యునైజేషన్ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వివరించారు.
ఇవీ చదవండి..