13 కోట్ల మంది జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాజధాని ఉందని.... ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్నో నుంచి పరిపాలన చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి సిద్దార్ద్ నాథ్ సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధులు ఎవరొచ్చినా... యూపీలో పాలనపై వివరిస్తామని సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శాసన, కార్యనిర్వాహక సంస్థలను వేరు చేయడం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. అలాగే గతంలో అధికారంలో ఉన్నప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని స్వాగతించిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇప్పుడు వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. భాజపా దేశంలో శాంతి నెలకొల్పుతుండటాన్ని సహించలేని కాంగ్రెస్.. పౌరసత్వ సవరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని హింసను ప్రేరేపిస్తుందని ధ్వజమెత్తారు.
రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాన మంత్రి హాజరయ్యారు. అప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఇప్పటికే అమరావతికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. యూపీలో 75 జిల్లాలు, 13 కోట్ల జనాభా ఉంది. మేము ఏకైక రాజధాని లక్నోతో మంచి పరిపాలన అందిస్తున్నాం. శాసన, కార్యనిర్వాహక సంస్థలను వికేంద్రీకరణ చేయకూడదు. ఆ రెండూ కలసి పని చేయాలి. అవసరమైన చోట ఏమైనా సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. అలాంటి వికేంద్రీకరణ మంచిది. కానీ శాసన, కార్యనిర్వాహక సంస్థలను వేరు చేయకూడదు- సిద్ధార్థ్నాథ్ సింగ్
ఇదీ చదవండి: