Unpaid salaries of teachers in AP : పాఠశాలల్లో కోడిగుడ్లు నిల్వ సరిగా లేకపోయినా వారిదే బాధ్యత. మరుగుదొడ్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేయకపోయినా, రాగిపిండి నిల్వ నమోదు చేయకపోయినా తప్పే.. ‘నాడు-నేడు’ పనుల్లో పురోగతి లేకపోయినా షోకాజ్ నోటీసులిస్తూ ఉపాధ్యాయులను వైసీపీ సర్కారు భయభ్రాంతులకు గురిచేస్తోంది. చదువు చెప్పించడం తప్ప అన్ని పనులూ ఉపాధ్యాయులతో చేయిస్తున్నారని గతంలో హైకోర్టు వ్యాఖ్యానించిందంటే.. తాజా పరిస్థితి ఎలా ఉందో తెలియనిది కాదు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులను వరసలో నెలబెట్టే బాధ్యత కూడా టీచర్లకే అప్పగించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
Teachers meeting with Botsa: మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ.. మేలు జరగకపోతే ఉద్యమం చేపడతాం
జీతాలే లేవు.. సకాలంలో జీతాలు అందకపోవడంతో బ్యాంకు వాయిదాలు, ఎల్‌ఐసీలు, కుటుంబ ఖర్చులు, మందులకు ఉపాధ్యాయులు చేయిచాచాల్సిన దుస్థితి నెలకొంది. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడమంటే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీలు, పదోన్నతులు పొందిన, సర్దుబాటులో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిన దాదాపు 30వేల మందికి మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం సెప్టెంబర్ 5న ప్రభుత్వం జీతాలిస్తుందని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది. హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ బోధిస్తున్న 1,700 మంది అధ్యాపకుల వేతనాలు ఇప్పటికీ ఖజానాకే చేరలేదు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి అప్‌గ్రేడ్ అయిన పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ( Teachers' Salary Bills ) ఇంకా సమర్పించనేలేదు. ఆర్థికశాఖ అనుమతి లేకుండానే ఎంఈఓ-2లను నియమించగా.. వారికి వేతనం ఎప్పుడు అందుతుందో తెలియని దుస్థితి. ప్రధానోపాధ్యాయుడు డీడీఓగా ఉండి.. ఆయా బడులకు కొత్తగా వచ్చిన, వెళ్లిన టీచర్ల వివరాలున్న చోటే బిల్లులను సమర్పించారు.
బకాయిలు అడగకూడదని.. జీతాలు ఆలస్యం చేస్తున్నారా..? : బొప్పరాజు
మరుగుదొడ్ల ఫొటోలు తీయలేదని.. గౌరవమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తున్న ప్రభుత్వం.. ఫొటోలు ఆన్‌లైన్ పెట్టలేదని షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో 68 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈఓ షోకాజ్ నోటీసులు ( Show Cause Notices ) జారీ చేయడం గమనార్హం. వారిపై క్రమశిక్షణ చర్యలు ఎదుకు తీసుకోకూడదో చెప్పాలంటూ పేర్కొన్నారు. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులను ఉపాధ్యాయులతోనే చేయిస్తూ.. పురోగతి సరిగా లేకుంటే ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తోంది. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వైసీపీ నాయకులే అనధికారికంగా కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. పనులు ఇచ్చేందుకు ఉపాధ్యాయులు అంగీకరించకపోతే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరో వైపు పనుల్లో జాప్యం జరిగినా.. నాణ్యత లేకపోయినా ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులు పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి వచ్చింది.
ఆర్థిక భారంతో పోస్టులు మాయం.. విద్యార్థులు తక్కువ ఉన్నారని 1-5 తరగతులున్న చోట ఒక్క ఉపాధ్యాయుడినే నియమించగా.. ఉదయం బడికి వెళ్లినప్పటి నుంచి సాయంత్రం పని వేళలు ముగిసే వరకూ విరామం లేకుండా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. 3,4,5 తరగతుల విలీనం, హేతుబద్ధీకరణ ఫలితంగా 9వేలకు పైగా పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే ఉన్నారు. ఆర్థిక భారంగా భావించి కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టని సర్కారు.. ఉన్నవాటినే సర్దుబాటు చేసింది. మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించేందుకు గాను 1,145 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను రద్దు చేయడం గమనార్హం. మోడల్ స్కూళ్లలో 3,260 ఉపాధ్యాయ పోస్టులకు సర్వీసు నిబంధనల (Service Rules) కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది. హైస్కూల్ 1,752 స్కూల్ అసిస్టెంట్ల కోసం 1,752 ఎస్జీటీ పోస్టులు లేకుండా చేయగా.. కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను మాయం చేసింది.
రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీటీఎఫ్
సుద్దముక్కలూ సొంత డబ్బులతోనే.. సమగ్ర శిక్ష అభియాన్ నుంచి ఇచ్చే నిధులను ప్రభుత్వం నిలిపివేయడంతో సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు ఉపాధ్యాయులు సొంత నిధులను ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది కొందరు ఉపాధ్యాయులు రూ.లక్ష వరకు సొంత డబ్బులు ఖర్చుచేసి బిల్లులు పెడితే ఇంతవరకు విడుదల చేయలేదు. ఆన్‌లైన్ హాజరు ( Online Attendance ) ఒత్తిడి.. యాప్ పనిచేసినా, చేయకపోయినా.. ఇంటర్నెట్ ఉన్నా.. లేకపోయినా ఉదయం 9 గంటలకే హాజరువేయాలని ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఆలస్యంగా వస్తే సెలవు పెట్టాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో హడావుడిగా బడులకు వెళ్తూ ఉపాధ్యాయులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన అధికారంతో దొడ్డిదారి బదిలీలు చేపట్టింది. అనుయాయులను కోరిన చోటకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో బదిలీల కోసం మంత్రి పేషీతో పాటు కొందరు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎలాంటి పలుకుబడి లేని, నిజాయతీగా ఉండే ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం అవమానించింది.