కరోనా రోగులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లో మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిస్థాయి కొవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘గాంధీ’ ఒక్కటే పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా ఉంది. మిగిలిన ఆసుపత్రులలో కరోనా చికిత్స అందిస్తున్నప్పటికీ రోగికి ఏ మాత్రం ఆరోగ్యం విషమించినా ఇక్కడికే పంపాల్సి వస్తోంది.
ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 800 మంది రోగులు ఉన్నారు. వీరిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉంది. వీరిపైనే అక్కడి వైద్యులు ప్రధానంగా దృష్టిసారించారు. ఇంతకుమించి రోగులను చేర్చుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. గాంధీపై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ స్థాయిలో కూడా దీనిపై చర్చ జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి.
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ స్పందించి.. పూర్తిస్థాయిలో కొవిడ్‌కు సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రులు రెండు మూడు ఉండాలని భావించారు.
22వతేదీ బుధవారం ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో మాట్లాడారు. ఫీవర్ ఆసుపత్రిలో 340 పడకలు ఉంటే కొవిడ్ రోగుల కోసం 190 వరకు ఉపయోగిస్తున్నారు. మరో 100 ఐసీయూ పడకలను తీర్చిదిద్దితే పూర్తిస్థాయిలో వైద్యం అందించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు.
తక్షణం వాటి ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ శంకర్‌ను ఆదేశించారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో 350 పడకలు ఉంటే 200 పడకల్లో కరోనా రోగులకు సేవలందిస్తోంది. ఇక్కడా 200 పడకలను ఐసీయూ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఆరోగ్యం విషమించినవారికి చికిత్స అందించడానికి అవకాశముంది. నగరంలో అన్ని ఆసుపత్రుల సమన్వయ బాధ్యతను ఐఏఎస్ అధికారి నీతూకుమారి ప్రసాద్‌కు అప్పగించారు.
ఇదీ చూడండి: గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ.. 832 కొత్త కేసులు