మానవాళికి మేలు చేసే సముద్ర జీవుల్లో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. సముద్ర తాబేళ్లు భూమి మీద ఉన్న అతి ప్రాచీనమైన సరీసృపాలు. వీటి జీవితకాలం 100 నుంచి 150 ఏళ్లు. ఇవి సముద్ర సంచార జీవులు. ఆహారం, గుడ్లు పెట్టడం కోసం సుమారు 20వేల కిలోమీటర్ల వరకు వలస వెళ్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్ల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు భారతదేశంలో ఉండగా.... ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ఎక్కువగా వచ్చేవి అలీవ్ రిడ్లీ తాబేళ్లు. సముద్ర తాబేలు ఒకేసారి 90 నుంచి 165 గుడ్లు పెడుతుంది. పదేళ్లకోసారి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి తమ సంతతిని పెంపొందించుకోవటం వీటి ప్రత్యేకత.
అటవీ శాఖ, అవనిగడ్డ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల కృషితో ప్రభుత్వం.... సాగర సంగమ ప్రదేశంలో ఆలివ్ రిడ్లీ (Olive Ridley) సముద్ర తాబేళ్ల సంరక్షణ చేపడుతోంది. 2020 జనవరిలో.. నాగాయలంక లైట్ హౌస్, సంగమేశ్వరం, సోర్లగొంది, ఈలచెట్ల దిబ్బలో... గుడ్ల సేకరణ, సంరక్షణ పునరుత్పతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. సముద్ర తాబేళ్ల గుడ్ల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లక్షల రూపాయల నిధులు ఖర్చుచేస్తున్నాయి. 2021లో కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉన్న సంరక్షణ కేంద్రాల్లో 65 వేల తాబేళ్ల పిల్లలు సముద్రంలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
అవగాహన లోపం వల్ల తాబేళ్ల జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. తాబేళ్లు ఒడ్డుకు వచ్చే సమయంలో మత్స్యకారుల బోటు ఫ్యాన్లు తగిలి వేలాది తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. బోటు ఫ్యాన్ రెక్కలు తగలకుండా మెస్ ఏర్పాటు, వలలో చిక్కుకుపోకుండా మత్స్యకారులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. గుడ్ల సేకరణలో నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో... గుడ్లు అడవినక్కల పాలవుతున్నాయి. సముద్ర కాలుష్యం, ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్న అరుదైన తాబేళ్లను సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. తీరప్రాంతాల్లో ఉన్న మత్య్సకారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండీ... పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం