దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదని తెలంగాణ ఆర్టీసీ(TSRTC news) ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. గడిచిన ఐదు రోజుల్లో కోటి 30 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేశామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, భధ్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలందిస్తుందని వెల్లడించారు. ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు.
కాలనీలకే బస్సులు
ఆర్టీసీని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని అంశాలపై దృష్టి సారిస్తామని గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆ దిశగా చర్యలను కూడా ప్రారంభించారు. ఆర్టీసీ అభివృద్ధితో పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను(TSRTC Dasara special buses) ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కాలనీలకే బస్సులు పంపే ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
సలహాలు, సూచనల కోసం..
టీఎస్ఆర్టీసీ(Tsrtc)కి ప్రయాణికులే పరమావధిగా భావిస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(tsrtc md sajjanar) ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, సంస్థ అభివృద్దికి సలహాలు, సంస్థ లోపాలపై ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఓ ట్విట్టర్ ఖాతా(Tsrtc twitter)ను కూడా ప్రారంభించి పలువురి సలహాలను, సూచనలను స్వీకరిస్తున్నారు.
MAA Elections 2021: ఓటేసిన తర్వాత చిరు, పవన్ ఏం మాట్లాడారంటే?