తెలంగాణ జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్ ఫలితం వెల్లడైంది. 668 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. జీహెచ్‌ఎంసీ ఫలితాలు వెలువడిన ఈ నెల 4వ తేదీనే నేరేడ్‌మెట్ డివిజన్ లెక్కింపు చేపట్టారు. తెరాస అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ... ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటం వల్ల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్ ఫలితాన్ని ప్రకటించలేదు.
ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడం వల్ల నేరేడ్‌మెట్ డివిజన్‌లో లెక్కింపును ఈ ఉదయం చేపట్టారు. సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కళాశాలలో లెక్కింపు కొనసాగింది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇంతకుముందు ఆధిక్యంలో ఉన్న తెరాస అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు.
నేరేడ్‌మెట్ డివిజన్‌లో మొత్తం 25,176 ఓట్లు పోలయ్యాయి. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్ల లెక్కింపులో తెరాసకు 278, భాజపాకు 115, కాంగ్రెస్‌కు 111 ఓట్లు వచ్చాయి. నేరేడ్మెట్లో తెరాసకు 10,330, భాజపాకు 9,662, కాంగ్రెస్‌కు 3,438 ఓట్లు రాగా... 604 చెల్లనివి, 323 ఓట్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.
తన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన తెరాస అభ్యర్థి మీనా... తనను గెలిపించిన నేరేడ్‌మెట్ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో జీహెచ్‌ఎంసీలో తెరాస కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది.
ఇదీ చూడండి:
సాధారణ డిగ్రీలకు ఉద్యోగాల కల్పనపై యూజీసీ దృష్టి