TDP Protest Against Illegal Mining: రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని.. వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెదేపా నేతలు ఆరోపించారు. అధికారపార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.
అవినీతి డబ్బు తాడేపల్లి రాజ ప్రసాదానికి చేరుతోంది: ఉమా
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్.. ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమమహేశ్వరరావు ఆరోపించారు. 'అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను సాక్షి గుమాస్తా, బూతుల మంత్రులు తిడుతున్నారని దేవినేని విమర్శించారు.
TDP leader Devineni on Illegal Mining: కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి, రాఘవపురం గ్రామాల వద్ద కొండ గ్రావెల్ అక్రమ తవ్వకాలను మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు. అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే, మైనింగ్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు నిలదీశారు.
గతంలో మైలవరంలో అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్తే కేసులు పెట్టారు. ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల కోసం అపార్ట్మెంట్లోని పార్కింగ్ స్థలాల్లో డబ్బులు దాచిపెడుతున్నారని.. ఇటీవల ఒక అపార్ట్మెంట్లో కట్టల కట్టల డబ్బులు దొరికాయని అన్నారు. రాష్ట్రంలో అవినీతి డబ్బు మొత్తం పార్టీ నాయకుల ద్వారా తాడేపల్లి రాజ ప్రసాదానికి చేరుతోందని ఉమా ఆరోపించారు.
లంకపల్లి ఇసుక క్వారీ వద్ద తెదేపా శ్రేణుల నిరసన..
TPD Leaders protest at Lankapalli sand quarry: ఇసుక దోపిడీని నిరోధించాలని డిమాండ్ చేస్తూ.. పామర్రు పమిడిముక్కల మండలం లంకపల్లి ఇసుక క్వారీ వద్ద తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలంటూ.. నినాదాలు చేశారు. ఈ క్రమంలో క్వారీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. తెదేపా నేతలు, కూలీలు క్వారీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కూలీల పొట్టకొట్టేలా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
'జిల్లాలోని మంత్రులు పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. కాంట్రాక్టర్లకు తొత్తులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ దాడుల్లో మంత్రి కొడాలి నానికి చెందిన అక్రమ నగదు పట్టుబడినా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు' అని తెదేపా నేతలు పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిన ఇసుకలో అడ్డగోలు దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. జేపీ అనే నామమాత్ర సంస్థ ముసుగులో యథేచ్ఛగా దోపిడీకీ పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అడ్డగోలు తవ్వకాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. లారీలతో తొక్కిస్తాం అంటూ వైకాపా నేతల వ్యాఖ్యలు దుర్మార్గం అని తెలుగుదేశం పార్టీ నేతలు దుయ్యబట్టారు. నిరసనలో తెదేపా సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, రావి వెంకటేశ్వరరావు, బొడే ప్రసాద్, పంచుమర్తి అనురాధ, పామర్రు పార్టీ ఇన్ఛార్జీ వర్ల కుమార్ రాజా, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
somu veerraju on chandrababu: 'అవసరం ఉంటేనే లవ్'.. చంద్రబాబుపై సోము వీర్రాజు సెటైర్లు