Tathayagunta Gangamma temple : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మహాకుంభాభిషేక వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నూతనంగా నిర్మించిన ఆలయంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి స్వర్ణ యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ఠ చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ట, ప్రథమ దర్శనం శాస్త్రోక్తంగా ముగిశాయి. వేడుకల్లో మంత్రి రోజా, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. గంగమ్మ తల్లి నామ స్మరణ చేస్తే ఎంతో పుణ్యఫలమని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. గంగ పుష్కర సమయంలో గంగమ్మ ఆలయ కుంభాభిషేకం జరగడం శుభ సూచకమన్నారు. ప్రతి ఆలయంలో జీర్ణోద్ధరణ చేయాలని... తద్వారా మరింత శక్తి వస్తుందన్నారు. పౌర్ణమి రోజు అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభపరిణామన్నారు. గంగమ్మ ఆలయ కుంభాభిషేకం పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి రోజా తెలిపారు.
కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం జరిగింది. ఎంతో శుభసుచకమైన ఈ రోజన ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. గంగమ్మ తల్లి గొప్పదనం ఏమిటో విజయేంద్ర సరస్వతి గారు తెలియజేశారు. - రోజా, మంత్రి
రాయదుర్గంలో.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామ పరిధిలో వెలసిన విప్రమలై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం శుక్రవారం భక్త జన సందోహం నడుమ అత్యంత కమనీయంగా జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు రామమూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం వేదపండితులు హరిప్రసాద్ భరద్వాజ్ శ్రీ స్వామి వారికి పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ నైవేద్య పూజలు చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణ, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం లోక కల్యాణార్థం శాంతి హోమం నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం గావించారు.
పెంచలకోనలో.. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన లోని పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి పుణ్య క్షేత్రం లో ఉత్సవ మూర్తులైన నరసింహ స్వామి, ఆది లక్ష్మి, చెంచు లక్ష్మి దేవతలకు కల్యాణం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా ఐదో రోజు ఈ వేడుకలు నిర్వహించారు. టీటీడీ నుంచి పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ జనార్దన రెడ్డి మాట్లాడుతూ.. గరుఢ సేవ, కల్యాణ మహోత్సవాలు వీక్షించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారని తెలిపారు. ఎల్లుండి ఉత్సవ మూర్తులను గోనుపల్లి కి తీసుకెళ్లడం తో వారం రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి :