ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ విషయం పై భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసిన భాజపా నాయకులు, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే అగ్రవర్ణ పేదల కోసం ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిందని భాజపా జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు.
ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఈ చట్టం అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలోను అగ్రవర్ణ పేదలు 13వేల ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రిజర్వేషన్లను అమలు చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండీ...