Telugu Desam Party leaders met the Governor: ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆర్టికల్ 355ను అమలు చేయాలని తెలుగుదేశం నేతల బృందం గవర్నర్ను కోరింది. రాష్ట్రంలో వివిధ వర్గాల పై జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి రాజ్ భవన్ లో గవర్నర్ కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేసింది. చెరుకుపల్లి లో అమర్నాథ్ సజీవ దహనం సహా వివిధ అంశాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టి కి తీసుకెళ్లింది. మహిళలపై అత్యాచారాలు, విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదంతం, హత్యలు, దాడులకు సంబంధించి గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుతో పాటు అనగాని సత్య ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, వర్ల తదితరులు గవర్నర్ ను కలిశారు.
మణిపుర్ తరహాలో ప్రత్యేకాధికారిని నియమించాలని... ఏపీలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కంట్రోల్ పెట్టడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని గవర్నరుకు విన్నవించామని నేతలు వెల్లడించారు. మణిపూర్ తరహాలో ఏపీలో కూడా ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. తమ అభ్యర్థనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని నేతలు పేర్కొన్నారు. జూన్ నెలలో 15 రోజుల్లో 15 సంఘటనలు జరిగాయని నేతలు ఫిర్యాదులో తెలిపారు. ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పేర్ని నాని ఇంటి సమీపంలోనే మరో దారుణం జరిగిందన్నారు. ఏపీలో వ్యాపారాలు చేసుకోలేను, ఈ సీఎంకు ఓ దండం అని చెప్పి సొంత ఎంపీనే హైదరాబాద్ వెళ్లిపోతానన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
డీజీపీ అసత్యాలు మాట్లాడుతున్నారు... అధికార పార్టీ ఎంపీనే ఏపీలో బతకలేమంటున్నారంటే... మరో సీఎం అయితే ఇప్పటికే రాజీనామా చేసేవారని ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలు బాగున్నాయని డీజీపీ మాట్లాడుతుంటే పక్కనున్న పోలీసులే పేపర్ అడ్డం పెట్టుకుని నువ్వుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో గంజాయి రవాణా, విక్రయాలపై నియంత్రణ కొరవడిందని ఆక్షేపించారు. అమలాపురంలో మున్సిపల్ ఛైర్మన్ పై ఓ కౌన్సిలర్ కొడుకు గంజాయి తాగి దాడికి వెళ్లారని తెలిపారు. ఉద్యమాలను, ప్రతిపక్ష గళాలను అణిచివేయడానికే పోలీసులను వినియోగిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో పాటు ఆయా అంశాలపై కేంద్రానికి నివేదించడంతో పాటు రాష్ట్రపతికి కూడా రిపోర్టు చేయాలని కోరాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలంటే కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశాం. ఆర్టికల్ 355 అమలు చేయాలని కోరాం. ఆయా అంశాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు