దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ చేపడుతున్న వేళ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నేటి నుంచి ఏప్రిల్ 14 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు టీకా ఉత్సవ్ నిర్వహించాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మల్లాగుల్లాలు..
కొవిడ్ టీకా డోసులన్నీ అయిపోవటంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించటంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీకా ఉత్సవ్‌ను నిర్వహించేందుకు 25 లక్షల డోసుల కొవిడ్ టీకాను పంపాల్సిందిగా సీఎం జగన్ ప్రధానికి శుక్రవారం లేఖ రాశారు.
రెండు లక్షలు మాత్రమే అందుబాటులో
ప్రస్తుతం రెండు లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 25 లక్షల డోసులు అందించకుంటే టీకా ఉత్సవ్ కార్యక్రమానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని లేఖలో వివరించారు. శనివారం అత్యధిక స్థాయిలో 2 లక్షల 33 వేల 806 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేయటంతో వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి.
కేంద్ర స్పందన లేదు
ప్రధానికి లేఖ రాసినప్పటికీ.. కేంద్రం స్పందించకపోవటంతో కొత్త డోసుల రాకలో జాప్యం నెలకొంది. ఫలితంగా టీకా ఉత్సవ్‌లో భాగంగా ప్రజలను అందించే వ్యాక్సిన్ ప్రక్రియ నెమ్మదిస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి : 85 రోజుల్లో పది కోట్ల టీకా డోసుల పంపిణీ