TDP state president Achchennaidu : బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడో.. సునీల్ ధియోధరో.. వేరెవరో అనుకుంటే ఫలితం లేదన్న ఆయన.. మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకే తెలుసు అని పేర్కొన్నారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారు.. ఏప్రిల్ 1వ తేదీన కేంద్రం ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ ఫిక్స్ చేస్తుందన్న అచ్చెన్న... జగన్ అదృష్టం కారణంగా అప్పులు.. ఎఫ్ఆర్బీఎం వెసులుబాట్ల విషయంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశాలు ఏపీకే వస్తున్నాయన్నారు. ఏప్రిల్ నెలలో ఏపీకి ఇవ్వాల్సిన అప్పును మార్చి నెలలోనే వచ్చేలా చేయడాన్ని ప్రస్తావించారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇతర పార్టీలపై టీడీపీ విధానాన్ని పొలిట్ బ్యూరోలో చర్చించాకే నిర్ణయిస్తామని తెలిపారు.
భయంతో కూడిన మార్పు కనిపిస్తోంది.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ అర్థమైందంటూ విజయసాయి ట్వీట్ పై అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబును అవమానించిన నాయకులు.. అవహేళన చేసిన వారంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును ఎవరు విమర్శించినా ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ప్రజల్లో మార్పు చూసి.. వైఎస్సార్సీపీ నాయకుల్లో భయంతో కూడిన మార్పు వచ్చిందని తెలిపారు. వైఎస్ వివేకా హత్యపై జరుగుతోన్న చర్చను పక్క దారి పట్టించేందుకే.. విశాఖలో కాపురం అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించే దమ్ముందా.. ఉత్తరాంధ్రకు తామేం చేశామో శ్వేతపత్రం విడుదల చేస్తాం... వైఎస్సార్ పార్టీకి ఆ దమ్ము ఉందా అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు.. ఎక్కువ ఖర్చు చేసింది చంద్రబాబునాయుడే అన్న విషయం ఇరిగేషన్ ఈఎన్సీనే చెప్పారని గుర్తు చేశారు. భావనపాడు పోర్టుకు టీడీపీ హయాంలోనే.. ఆనాడే గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇప్పుడు శంకుస్థాపన చేస్తారా అంటూ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని అన్నారు. వెంటిలేటర్ మీదుండి శంకుస్థాపన చేస్తామంటే ఎవరు నమ్ముతారని విమర్శించారు. జగన్ రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రేనా అన్న అచ్చెన్నాయుడు... కోర్టుల్లో కేసులుంటే విశాఖ వెళ్లి కాపురం పెడతానంటారా అంటూ దుయ్యబట్టారు.
చంద్రబాబుతో పోటీ పడగలరా.. ఒళ్లు మదమెక్కి తెలుగు దేశం పార్టీ అధినేతని అవహేళన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబుతో దేంట్లోనైనా పోటీగలడా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు... ప్రజలు చేసుకున్న దురదృష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఓ దుర్మార్గుడి చేతిలో పడి సర్వనాశనం అయ్యిందనే బాథ ప్రతి ఒక్కరిలో నెలకొందని తెలిపారు. పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు తీసుకున్న సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి :