రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అమరావతి ఐకాస నిరసనలు చేయనుంది. అమరావతి ఐకాస పిలుపునిచ్చిన మూడు రోజుల ఆందోళనలకు తెలుగుదేశం సంఘీభావం తెలిపింది. ఈ నెల 29,30, 31 తేదీల్లో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో తెదేపా శ్రేణులు పాల్గొనాలని అధినేత చంద్రబాబు సూచించారు. వరద నష్టాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర రైతాంగ ఆశాదీపం పోలవరంను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వారికి సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 29న మండల రెవిన్యూ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించాలని.. 30న రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్, గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 31న ‘చలో గుంటూరు జిల్లా జైలు’ కు సంఘీభావం తెలపాలని పేర్కొన్నారు. రాజకీయ, ప్రజా సంఘాలు మూడు రోజుల పాటు ఆందోళనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలపాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి. రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా ఇవ్వాలి: సీఎం జగన్