తెదేపా ప్రభుత్వ హయాంలో అన్ని సౌకర్యాలతో జీ+3 ఇళ్ల నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వం అవి పక్కన పెట్టి ఊరి చివర పనికి రాని స్థలాలు పేదలకు కేటాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సౌమ్య దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా హనుమంతుపాలెంలో జీ ప్లస్ త్రీ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఇళ్ల స్థలాల పేరిట పేదల కొంపలు కూలుస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను ఏడాది దాటినా పేదలకు ఎందుకు ఇవ్వలేదని.. బిల్లులు ఎందుకు ఆపారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గ్రామాల్లో 4,5 లక్షల రూపాయలు కూడా విలువ చేయని భూములను సుమారు 40, 50 లక్షల రూపాయలు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, పనికిరాని భూములకు అధిక ధరలు చెల్లించి.. ముంపుప్రాంతాల్లో శ్మశానాల్లో గుట్టల్లో పేదలకు అంటగట్టేది ఎవరికోసమని ప్రశ్నించారు. ఇళ్ల పంపిణీ పక్కనపెట్టి గ్రామాల్లో వైకాపా నేతలు ఇళ్ల స్థలాల పేరుతో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు