రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతోన్న తమ్మినేని సీతారాంకు సభాపతిగా కొనసాగే అర్హత లేదని తెలుగుదేశం ఆరోపించింది. రాజకీయాలే ముఖ్యమని భావిస్తే.. స్పీకర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడుకోవాలని తెదేపా ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, గౌరివాని శ్రీనివాసులు, బీటీ నాయుడు హితవు పలికారు.
ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత ఇతర బిల్లులు పెట్టమని తెదేపా సభ్యులు కోరితే.. అమరావతి, మూడు రాజధానులు బిల్లులపై పట్టుపట్టారన్నారు. ఇదంతా తెలిసీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శాసనమండలిలో సభ్యుల కారణంగానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని వ్యాఖ్యానించడం దుర్మార్గమని మండిపడ్డారు. బిల్లు పెట్టకుండా ఎవరు అడ్డుకున్నారో వీడియో ఫుటేజీ బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి.. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెదేపా నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు, సభ్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. రాజ్యాంగ విలువలను కాపాడాలన్న విషయాన్ని తమ్మినేని గుర్తుంచుకోవాలని తెదేపా నేతలు సూచించారు.
ఇదీ చదవండి: