శాసన మండలిలో అధికార పార్టీ మంత్రుల దుర్భాషలు, దాడిపై ఈనెల 18న తాము ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తే, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. మంత్రుల కౌంటర్ ఫిర్యాదులో వాస్తవముంటే వీడియో ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మండలిలో జరిగిన దానిపై వైకాపా సభ్యులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'ఈనెల 17న శాసనమండలిలో జరిగిన దానిపై మేం 18న ఫిర్యాదు చేశాం. మేం ఫిర్యాదు చేసిన 6 రోజుల తర్వాత వైకాపా సభ్యులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. అంటే ఏమిటర్థం.. మా ఫిర్యాదుపై దర్యాప్తు చేపడితే వాస్తవాలు బయటకొస్తాయనే భయంతో 6 రోజుల తర్వాత కంప్లైంట్ చేశారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు అవాస్తవాలు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి'-- దీపక్ రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ
3 రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినప్పుడు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని.. మండలిలో సమస్య ఉన్నప్పుడు లైవ్ టెలీకాస్ట్ ఆపేయడమే వైకాపా ప్రభుత్వ పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో జరిగిన వాస్తవాలు బయటకు రావాలంటే వీడియో ఫుటేజీని పరిశీలించడం ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు. తెదేపా సభ్యుల తప్పుంటే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి...