సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి తేరుకోక ముందే విజయవాడ తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎంపీ కేశినేని నాని, మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. నగరపాలక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ కార్పొరేటర్లలంతా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇరువురి నాయకత్వంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు కలిసిమెలసి తిరిగిన ఇద్దరు నేతలు.. నగరంపై ఆధిపత్యం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఇటీవలే నగరపాలక సంస్థ పదవీకాలం ముగియడంతో మాజీ కార్పొరేటర్లతో ఎంపీ కేశినేని నాని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో నాగుల్‌మీరాను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని... అందుకు అందరూ సహకరించాలని ఎంపీ నాని స్థానిక నేతలకు సూచించారు.
కేశినేని వర్గీయుడిగా ఉన్న నాగుల్‌మీరా రెండుసార్లు ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. ఈ వ్యవహారంపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర అధ్యక్షుడుగా ఉన్న తనకు తెలియకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. పైగా తన విరోధైన నాగుల్‌మీరాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నానికి పోటీగా బుద్దా వెంకన్న సైతం మాజీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. దీనిపైనే కేశినేని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
బెజవాడ పంచాయితీని తెదేపా అధినేత వద్దకు తీసుకెళ్లేందుకు ఇరు వర్గాలు సిద్ధమైనట్టు తెలిసింది. కాగా... వివాదం మరింత ముదరకముందే వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నట్టు సమాచారం.