విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా, తీర్మానం చేశామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలను సైతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో ఉన్న పరిశ్రమలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైకాపా ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు తెదేపా పోరాటానికి సిద్ధంగా ఉందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణ వైపు అడుగులు...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ(privatization of the Vizag steel plant) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేలా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షన్ అడ్వయిజర్), న్యాయ సలహాదారుల (లీగల్ అడ్వయిజర్) నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అత్యంత క్లిష్టమైన ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు ఎంతో ముఖ్యం. కీలకమైన వీరి నియామకానికి టెండర్లు పిలవాల్సి ఉంది. అధికారులు అందుకు నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. టెండర్లో ముందు నిలిచిన వారికి ప్రైవేటీకరణ ప్రక్రియ బాధ్యతలను అప్పగిస్తారు. ఒకవైపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రంలో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు, కర్మాగార ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం ఇలా ముందడుగు వేయడంపై కార్మికుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఇవీచదవండి.