జగన్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే దిశగా కుట్రలు పన్నుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. సజావుగా సాగుతున్న ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ చేపట్టడం రైతులను ఇబ్బంది పెట్టడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జగన్ చెల్లించడం మధ్యలో మానేస్తే రైతుల గతేంటని ప్రశ్నించారు.
ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకం పెడతాం అనేది ఒక తుగ్గక్ నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసమే సౌర విద్యుత్ అని చెప్పడం బూటకమేనన్న కళా.. మీటర్లు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ఇది రైతు ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతిస్తోందని మండిపడ్డారు. జగన్ విధానాల వల్ల రైతులు మరింత దెబ్బతింటారని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలు రద్దు చేసి వారిని మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది రైతుల పాలిట పిడుగుగా ఉంటుందని.. విద్యుత్ కష్టాలు తగ్గించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు.
విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపడంలో విఫలమై.. రైతులపై భారం వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం రైతులను వంచించడమేనని ఆరోపించారు. ఉచిత విద్యుత్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో కుట్రకు తెరలేపిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు, వాళ్లలో బ్యాంక్ అకౌంట్ ఎంతమందికి ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
విద్యుత్ కనెక్షన్ ఒకరి పేరు మీద, పొలం మరొకరి పేరు మీద ఉండే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. పాత అకౌంట్ లో డబ్బులు వేస్తే రైతుల పాత బకాయిల కింద బ్యాంకర్లు జమచేసుకుంటారని.. అందుకే కొత్త ఖాతాలు ప్రారంభించాలని చెప్పడం రైతులను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతోనే రైతులు అప్పుల పాలవుతున్నారన్నారని తెలిపారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని... రాష్ట్రంలోనే ఎవరి ప్రయోజనం కోసం ప్రవేశపెడుతున్నారని నిలదీశారు.
ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 368 మందికి కరోనా.. 84 మంది మృతి