TDP senior leader Dhulipalla Narendra : జగనే మా దరిద్రమని రైతులంతా గొంతెత్తి చెప్తున్నారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. రోమ్ నగరం తగలబడుతుంటే.. అనే సామెత రీతిన, రైతులు కన్నీరు పెడుతుంటే.. అభినవ నీరో చక్రవర్తి తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. హెలికాప్టర్ దిగి రైతుల బాధలు చూసే తీరిక కూడా సీఎంకు లేదా అని నిలదీశారు. ప్రభుత్వం రైతు బాధల్ని పట్టించుకోకపోగా వారిని తీవ్రంగా అవమానిస్తోందన్నారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని విమర్శించటం తప్ప వ్యవసాయ శాఖ మంత్రికి వేరే పనేమైనా ఉందా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.
బీమా పేరిట మోసం.. రైతుల నుంచి 40లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా, ఇప్పటి వరకు 5లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. 50లక్షల రైతులకు గాను కేవలం 25లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ కట్టి రైతుల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ భీమా కింద రబీకి డిసెంబర్ లోగా కట్టాల్సిన ప్రీమియం కట్టకుండానే తప్పుడు జీవోలతో మోసగిస్తున్నారన్నారు. అకాల వర్షాల వల్ల 5లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని, దళారులు రైతుల్ని దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఉచిత వ్యవసాయ భీమా పథకం ఓ బూటకమన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న దైన్యం జగన్ రెడ్డికి కనిపించట్లేదా అని నిలదీశారు. చంద్రబాబు రోడెక్కి పోరాడితే తప్ప అధికారుల్లో ఎంతో కొంత చలనం రాలేదని అన్నారు. ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు పిలుపునిచ్చిన రైతు పోరుబాట కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.
జగనన్నే మా నమ్మకం అని ఇంటింటికీ స్టిక్కర్ వేస్తున్నారు కానీ, జగనన్నే మా దరిద్రం అని రైతులు చెప్తున్నారు. కల్లాల్లో నీరు చేరి కుటుంబ సభ్యులంతా కష్టపడుతుంటే.. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తే తప్ప.. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు దిగిరాలేదు. కేంద్రం వెల్లడించిన ఫసల్ బీమా యోజన జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు కూడా కనబడడం లేదు. జీవో నంబర్ 66 ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్తున్నదంతా బూటకం. అకాల వర్షాల కారణంగా వరి, తెల్ల జొన్న మొక్కజొన్న తదితర పంటలు నష్టపోయిన రైతాంగానికి రూ. 25 వేల పరిహారం చెల్లించాలి. అదే విధంగా మామిడి తో పాటు మిర్చి తదితర పంటలు నష్టపోయిన రైతులకు రూ.50వేల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. - ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ సీనియర్ నేత
ఇవీ చదవండి :