TDP Agitation at Mineral Development Corporation Office: తాడిగడపలోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం వద్ద భారీగా పోలీసులు మోహరించటంతో వ్యూహం మార్చుకుని తాడిగడప ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇసుక అక్రమ క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
TDP Protest Against YCP Sand Exploitation: వైసీపీ ఇసుక దందాపై టీడీపీ నిరసనలు.. పలుచోట్ల ఉద్రిక్తత
భారీ కుంభకోణం.. ఇసుక పాలసీ పేరుతో జగన్మోహన్ రెడ్డి 40వేల కోట్ల రూపాయలు దిగమింగాడని ఆరోపించారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థను తెరముందుకు తెచ్చి.. తెర వెనుక తన అనుయాయులతో ఇసుక మొత్తాన్ని జగన్ హస్తగతం చేసుకున్నాడని నేతలు ధ్వజమెత్తారు. తన అనుచరులతోనే దగ్గరుండి ఇసుక మాఫియాను నడిపిస్తూ.. తన ఖజానా (Treasury) నింపుకుంటున్నాడని మండిపడ్డారు. హోల్ సేల్ దోపిడీ చేస్తూ భవన కార్మికుల పొట్ట కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థకు ఇచ్చిన టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా అదే కంపెనీ బిల్లులతో ఇసుక అమ్మకాలు ముమ్మాటికీ కుంభకోణమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ (NGT), సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా తవ్వకాలు ఎలా కొనసాగిస్తున్నారని నేతలు నిలదీశారు.
టీడీపీ నేతల నిరసన... ఇసుక అక్రమాలపై తెలుగుదేశం నేతల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఎండీ అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. ఎండీ వెంకట్ రెడ్డి సెలవులో ఉన్నారని టీడీపీ నేతలకు అధికారులు స్పష్టం చేశారు. తమ ఫిర్యాదు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రావాలంటూ కార్యాలయం వద్దే తెలుగుదేశం నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో తెలుగుదేశం నేతల నుంచి ఫిర్యాదును ఏపీఎండీసీ జేడీ (APMDC JD) తీసుకున్నారు. ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి, ఏపీఎండీసీకి వ్యతిరేకంగా కార్యాలయంలోనే తెలుగుదేశం నేతలు (TDP Leaders) నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
కాంట్రాక్టు ముగిసినా.. జగన్మోహన్ రెడ్డి అవినీతి విధానాల వల్ల సామాన్యులు ఎవ్వరికీ ఇసుక దొరకట్లేదని వాపోయారు. జగన్ అవినీతి ధన దాహానికి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆక్షేపించారు. మే నెలలో జేపీ వెంచర్స్ (JP Ventures) కాంట్రాక్టు ముగిసినా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మైనింగ్ అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై ఇసుకను దోచుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పమని వినతిపత్రం ఇద్దామంటే అధికారులెవ్వరూ అందుబాటులో లేరని దుయ్యబట్టారు. అనుమతులు లేకుండా ఇసుక ద్వారా ప్రతీరోజు కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. ప్రజా సంపదపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇసుకపాలసీ 15వందల కోట్లు అని చెప్పి.. గడువు ముగిసినా సరే లక్షల టన్నుల ఇసుక అమ్ముకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి, ధనదాహం వల్ల రాష్ట్రంలో పేదలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇసుక దోపిడీ ఆపాలని మేం డిమాండ్ చేస్తున్నాం. - జీవీ ఆంజనేయులు, టీడీపీ సీనియర్ నేత
ఇసుక కొండలు ఏర్పాటు చేసి ప్రతి రోజూ కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతోంది. ఇది చాలా దారుణం. ప్రజల తరఫున పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. - కొమ్మాలపాటి శ్రీధర్, తెదేపా సీనియర్ నేత
జేపీ వెంచర్స్ సంస్థ కాంట్రాక్టు గడువు ముగిసినా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో ఎన్జీటీ తీర్పులను కూడా పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. అన్ని శాఖల అధికారుల జేబుల్లోకి నిధులు వెళ్తున్నాయి. - నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు