వైకాపా అధికారంలోకి రాగానే నందిగామ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అక్రమ ఇసుక, ఎర్రమట్టి తవ్వకాలపై కన్నేశారని... మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. పల్లగిరి, రాఘవాపురం, పెద్దవరం గ్రామాలలో వందలాది ఎకరాల విస్తీర్ణంలోని ఎర్రమట్టి కొండల్ని నాశనం చేశారన్నారు.
తెదేపా నాయకులతో కలసి పల్లగిరి, రాఘవాపురంలో అక్రమ తవ్వకాలను ఆమె పరిశీలించారు. ఏడాది కాలంలోనే రూ. 25కోట్ల అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జరిగినట్లు ఆరోపించారు. ఎర్రమట్టి తవ్వకాలపై అధికారులకు గతంలో ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా నాలుగు లారీలపై కేసులుపెట్టి దొడ్డిదారిన వెంటనే విడుదల చేశారని ఆరోపించారు.
మట్టి తవ్వకాలపై అనుమతులు చూపించమని అడుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ, పోరంబోకు భూముల్లో వ్యవసాయం చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బిసీ కులాలకు చెందిన రైతులను బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి అంతేలేదన్నారు. అక్రమ తవ్వకాలపై అధికారులు స్పందించకపోతే తెదేపా ఆందోళనలు చేస్తుందని ఆమె హెచ్చరించారు.